Friday, November 22, 2024

Manipur Clashes | మణిపూర్​లో ఆగని హింస.. ఇరు వర్గాల దాడుల్లో నలుగురు మృతి

మణిపూర్​లో మరోసారి హింస ప్రజ్వరిల్లింది. బిష్ణుపూర్ జిల్లాలోని కంగ్వాయ్ ప్రాంతంలో నిన్న, ఇవ్వాల జరిగిన ఘర్షణల్లో మణిపూర్​ పోలీసు కమాండోతోపాటు మరో ముగ్గురు చనిపోయారు. పరిస్థితి తీవ్రతరం కాకుండా భద్రతా దళాలు బఫర్ జోన్‌ను ఏర్పాటు చేసినప్పటికీ రెండు వర్గాల ప్రజలు రాత్రి వేళ ఘర్షణలకు తెగబడ్డారు. గత రాత్రి కొండపై నుండి గుంపులు గుంపులుగా లోయలోని కొన్ని గ్రామాలను తగలబెట్టడానికి ప్రయత్నించారు. అయితే.. వీరంతా బయటి ప్రాంతాల నుంచి తరలివచ్చారని స్థానికులు చెబుతున్నారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

మణిపూర్​లో హింస ఆగలేదు. షెడ్యూలు తెగల మధ్య తలెత్తిన ఈ ఘర్షణలు నానాటికీ తీవ్రమవుతున్నాయి. అయితే.. నిన్న జరిగిన దాడుల్లో  భద్రతా బలగాలు దీటుగా స్పందించి ఇండ్లను తగలబెట్టకుండా అడ్డుకున్నాయి. మే 3వ తేదీన మణిపూర్​లో జాతి హింస చెలరేగినప్పటి నుండి 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 3,000 మందికి పైగా గాయపడ్డారు. షెడ్యూల్డ్ తెగ (ST) కోసం మెయిటీ కమ్యూనిటీ డిమాండ్‌కు వ్యతిరేకంగా కొండ జిల్లాలలో  ఆదివాసి సంఘీభావ యాత్ర నిర్వహించారు.

కాగా, ఇక్కడ హింసను ఆపడానికి, రాష్ట్రంలో సాధారణ స్థితికి తీసుకురావడానికి మణిపూర్ పోలీసులతో పాటు దాదాపు 40,000 మంది కేంద్ర భద్రతా సిబ్బందిని మోహరించారు. మణిపూర్ జనాభాలో మెయిటీలు దాదాపు 53శాతం ఉన్నారు. వీరంతా ఇంఫాల్ లోయలో ఎక్కువగా నివసిస్తున్నారు. గిరిజన నాగాలు, కుకీలు వీరి జనాభాలో మరో 40 శాతం ఉన్నారు. వీరంతా కూడా  కొండ జిల్లాలలో నివసిస్తున్నారు. అయితే.. కాంగ్‌వై, సాంగ్‌డో, అవాంగ్ లేఖాయ్ గ్రామాల నుండి కొంతమంది వ్యక్తులు ఒకరిపై ఒకరు కాల్పులు జరపడంతో నిన్న మరోసారి ఘర్షణ తలెత్తింది. దీని ఫలితంగా ఇరువైపులా గాయాలతో పాటు ముగ్గురు వ్యక్తులు మరణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement