లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఈక్రమంలో ఇవాళ ఉదయం ఢిల్లీలోని పీపీ సుబ్రొతో పార్క్‌లోని ఝరేరా ఫ్లైఓవర్ సమీపంలో వాహనాలను తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రూ.3 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.
నలుగురు యువకులు తమ స్కూటర్‌పై వెళుతుండగా, నల్లరంగు బ్యాగులు కలిగి ఉన్నారని, పోలీసులకు మొదట అనుమానం వచ్చి విచారించగా వారి బ్యాగుల్లోని రూ.3 కోట్ల నగదు బయటపడింది. ఈ డబ్బు హవాలా నుంచి వచ్చినదని విచారణలో తేలింది.
ఢిల్లీ కాంట్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ విపిన్ కుమార్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఇటీవలి మార్గదర్శకాలను అనుసరించి, నలుగురు యువకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో మహ్మద్ షోమిన్, జిషాన్, డానిష్, సంతోష్ ఉన్నారు. విచారణలో రికవరీ చేసిన మొత్తం హవాలా డబ్బు అని, ఇది షహదారాలో స్క్రాప్ డీలర్‌గా పనిచేసిన మహ్మద్ వకీల్ మాలిక్‌కు చెందినదని నిందితులు చెప్పారు.
ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత రాజధానితోపాటు దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంది. ఎన్నికలు సక్రమంగా ముగిసే వరకు దేశవ్యాప్తంగా ప్రవర్తనా నియమావళి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వేలాది మంది భద్రతా బలగాలను మోహరించారు. సమాచారం మేరకు స్కూటర్‌పై వెళ్తున్న నలుగురు యువకులను పోలీసులు కొంత సమాచారం అడిగి పత్రాలు చూపించాలని కోరగా సరైన పత్రాలు కనిపించకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. పోలీసులు అందరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.