Tuesday, November 26, 2024

Big Story : వాహన కాలుష్యానికి పోలీసుల చెక్ .. ఆన్‌లైన్ సిస్టం అనుసరించాలన్న‌ రవాణా శాఖ

ఆంధ్రప్రభ , హైదరాబాద్‌ : అసలే చలి కాలం.. ఆ పై రోడ్డెక్కితే చాలు పొగమంచు కమ్మేసేలా వాహనాల కాలుష్యం వెరసి నగర జీవిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇదే అదువుగా పలు కాలుష్య నియంత్రణ పత్రాలను జారీ చేసేందుకు పలు చోట్ల రోడ్లపై వాహనాలు నిలిపి ఉంచేసి పత్రాలను జారీ చేస్తున్న ఉదంతాలు ఎన్నో.. ఈ క్రమంలో ముందు హైదరాబాద్‌లో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు కొత్త నిర్ణయం తీసుకున్నారు. వాహనాల ద్వారా వెలువడే కాలుష్యం పరిమితులకు లోబడే ఉందంటూ రోడ్ల పక్కన ఉండే వ్యాన్లు ఇచ్చే ధృవ పత్రాలు ఇకపై చెల్లవని చెబుతున్నారు. కాలుష్య దృవ పత్రం పొందిన వాహనం రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఆన్‌లైన్‌ ద్వారా రవాణా శాఖ సర్వర్‌, ట్రాఫిక్‌ పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌కు ఏక కాలంలో చేరితేనే ధృవపత్రానికి విలువ ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

ముఖ్యంగా వాహన కాలుష్య పరిమితి ధృవపత్రాలను ప్రస్తుతం రవాణా శాఖ అనుమతి పొందిన ఏజెన్సీలు, సంచార వాహనాలు ఇస్తున్నాయి. ఈ విధానంలో అక్రమాలకు తావులేకుండా అన్ని సంచార వాహనాలు ఆన్‌లైన్‌ విధానాన్ని అనుసరించాలని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే ముంబై, ఢిల్లి, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఈ విధానం అమలులో ఉంది. కాగా కాలుష్య ధృవపత్రం జారీ చేసే ప్రతి సంచార్‌ వాహనంలో అంతర్జాల ఆధారిత కంప్యూటర్‌ ఉంటుంది. ధృవపత్రం పొందిన ప్రతి వాహనం వివరాలు , ఫలితం అందులో నమోదు కాగానే రవాణా శాఖ సర్వర్‌ కు అక్కడి నుండి ట్రాఫిక్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు చేరుతుంది. దాని నుంచి రోడ్లపై ట్రాఫిక్‌ విధుల్లో ఉండే పోలీసుల పిడిఏ ( వ్యక్తిగత డిజిటల్‌ సహాయ కారి) యంత్రాలకు వెళ్తుంది.

- Advertisement -

తనిఖీలప్పుడు వాహన నంబర్‌ను నమోదు చేయగానే కాలుష్య పరిమితి ధృవపత్రం ఉందా లేదా తెలిసి పోతుంది. కాగా ప్రస్తుతం ఆన్‌లైన్‌ విధానం లేక పోవడంతో కొందరు నిర్వాహకలు ఇష్టారాజ్యంగా కాలుష్య ధృవీకరణ పత్రాలను ఇచ్చేస్తున్నారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చే వారి అనుమతుల రద్దుకు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లో ఓ ఐటి ఉద్యోగి ఎప్పటి లాగే తన వాహనాన్ని పోలీసులు తనిఖీ చేస్తారన్న ఉద్దేశంతో రోడ్డు పక్కన ఆపిన వాహనం వద్దకు వెళ్లి పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ను తీసుకున్నారు. అయితే ఈ సర్టిఫికెట్‌ చెల్లదని పోలీసులు చెప్పడంతో నిర్గాంతపోయారు. ఈ సమస్య ఒక పోలీస్‌ అధికారికి కూడా ఎదురైనట్లు చెబుతున్నారు. గత నెల తన వాహనానికి కాలుష్య దృవీకరణ పత్రం ఇవ్వాలని కోరగా జారీ చేసిన పత్రంపై డిసెంబర్‌ 2022 వరకు ఉండాల్సి ఉండగా మరో ఏడాది అదనంగా ఇస్తూ దృవీకరణ పత్రం జారీ చేశారు. ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతోనే ఆన్‌లైన్‌ విధానాన్ని అమలులోకి తెచ్చినట్లు ట్రాఫిక్‌ పోలీసులు చెబుతున్నారు.

ఆ ధృవపత్రాలు పేరుకు మాత్రమే…

కాగా ఆ దృవపత్రాలను నామ్‌ కే వాస్తేగానే ఉంటాయని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. తమకు రవాణా శాఖ అనుమతి ఉందని మరీ చెబుతున్నాయి కూడా. ఈ క్రమంలో అమాయకులు వాటిని నమ్మేస్తున్నారు. పైగా రవాణాశాఖ ద్వారా అనుమతి పొందిన ఎజెన్సీలు వాహనం కాలుష్యం పరిమితిలోపే ఉందంటూ పొల్యూషన్‌ అండర్‌ కంట్రోల్‌ పత్రాలను జారీ చేసేస్తున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్‌ పోలీసులతో ఎందుకు వచ్చిన తంటాలు అనుకుంటూ ఆటో వాలాలు 60 శాతం మంది, ద్విచక్రవాహన దారులు మరో 30 శాతం మంది తమ వాహనాలను పొల్యూషన్‌ తనిఖీ చేయించుకోకుండానే వారిని సంప్రదించేసి సర్టిఫికెట్లను తీసుకుని చెకింగ్‌ సమయంలో ట్రాఫిక్‌ పోలీసులకు చూపుతున్నారు. దీని వల్ల పది, పదిహేనేళ్ల కిందట కొనుగోలు చేసిన వాహనాల నుండి వెలువడే కాలుష్యానికి చెక్‌ పడడం లేదని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement