తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఆదివారంతో ముగిసింది. అయితే చివరి రోజైన ఆదివారం కమల్ హాసన్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తాను ప్రయాణిస్తున్న ప్రచార వాహనంపై శ్రీరాముడు, సీతాదేవి దేవుడి వేషాలతో ఉన్న వారిని నిలబెట్టి కోయంబత్తూరులో ప్రచారాన్ని చేశారు. ఆయన మాట్లాడుతూ.. వీరిద్దరూ హిందూ దేవుళ్లేనని, వీరిని అడ్డు పెట్టుకుని కొందరు రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించడం కలకలం రేపింది.
కమల్ వైఖరిపై కొందరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు కాట్టూరు పోలీసు స్టేషన్‌లో కేసు రిజిస్టర్ అయింది. కమల్‌పై ఐపీసీలోని మూడు సెక్షన్ల కింద కేసు పెట్టినట్టు పోలీసులు వెల్లడించారు. అటు తమిళనాడులో ఎలాగైనా మరోసారి అధికారాన్ని దక్కించుకోవడం ద్వారా హ్యాట్రిక్ సాధించాలని అన్నాడీఎంకే – బీజేపీ, రెండు దఫాలుగా అధికారానికి దూరమై.. ఈ సారి ఎలాగైనా గెలవాలన్న కృతనిశ్చయంతో ఉన్న డీఎంకే జోరుగా ఎన్నికల ప్రచారం సాగించాయి.