మాస్క్ పెట్టుకోలేదన్న కారణంతో సామాన్య ప్రజలపై దారుణంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు. ఇదే కారణంతో ఓ మహిళను ఆమె కూతురి ముందే నడిరోడ్డుపై పడేసి, ఆమె జుట్టును లాగుతూ కొట్టిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఓ మహిళ తన కుమార్తెతో కలిసి సరుకులు కొనుక్కుని వెళ్లడానికి బయటకు వెళ్లింది. ఆమె మాస్కు ధరించకపోవడాన్ని చూసిన పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లడానికి వాహనం ఎక్కాలని చెప్పారు. ఆమె ఎక్కకపోవడంతో ఓ లేడీ పోలీసు దాడి చేసింది.
తన తల్లిని కొట్టొద్దని ఆమె కూతురు వేడుకుంటున్నప్పటికీ పోలీసులు ఆ యువతిని పక్కకు లాగి పడేశారు. మాస్కు పెట్టుకోని మహిళను వాహనంలోకి ఎక్కాలంటూ నడిరోడ్డుపైనే కొట్టారు. ఆమె ఎంతకీ ఎక్కకపోవడంతో ఆమె జుట్టుపట్టుకుని, రోడ్డుపై పడేసి లేడీ పోలీసు కొట్టింది. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో చూస్తోన్న నెటిజన్లు.. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఒకరు స్మార్ట్‌ఫోన్‌లో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో ఆ వీడియో వైరల్ అవుతోంది.