న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో చట్టబద్ధ పాలన సాగడం లేదని, పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. గురువారం న్యూఢిల్లీలో టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, గల్లా జయదేవ్ తదితరులు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌తో పాటు హోం శాఖ కార్యదర్శితో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పాలన జరుగుతున్న తీరును ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మంత్రులు, అధికార పార్టీ నేతలు అధికారానికి దుర్వినియోగానికి పాల్పడుతున్నారని చెప్పారు. రాష్ట్ర పోలీసులు ఉద్దేశపూర్వకంగా పౌరుల ప్రాథమిక హక్కులను అణచివేస్తున్నారని, చట్టబద్ధ పాలన సాగేలా కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకుని ఆదేశాలివ్వాలని కోరారు. కేంద్రమంత్రితో భేటీ అనంతరం ఎంపీ కనకమేడల మాట్లాడుతూ… అమరావతి టు అరసవల్లి పాదయాత్రకు రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. తణుకు పాదయాత్రలో అడ్డంకులు సృష్టించిన సంఘవిద్రోహ శక్తులను నిలువరించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు.
అమరావతి రాజధాని రాష్ట్ర ప్రజలందరిదన్న ఆయన, కేవలం 29 గ్రామాల ప్రజలది కాదని స్పష్టం చేశారు. పోలీసుల అనాగరిక చర్యలు, వైసీపీ కార్యకర్తల రౌడీయిజం, పాదయాత్రకు రక్షణ కల్పించడంలో వైఫల్యం గురించి వివరించామన్నారు. అరసవెల్లి వరకు పాదయాత్ర కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని, పరిస్థితులు చెయ్యిదాటి పోకుండా చూడాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఉత్తరాంధ్ర మంత్రులు రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా వ్యవహరిస్తున్నారని, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉత్తరాంధ్ర మంత్రులు కేవలం ఆ ప్రాంతానికే కాకుండా రాష్ట్రానికి మంత్రులు అన్న విషయం గుర్తుంచుకోవాలని రవీంద్రకుమార్ సూచించారు. ప్రజలను రెచ్చగొట్టి పాదయాత్రకు అడుగడుగున అడ్డంకులు కలిపిస్తున్నారని, కొంతమంది కావాలనే ప్రభుత్వ ప్రోత్సాహంతో పాదయాత్రలో అల్లర్లు, అలజడులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హైకోర్టు తీర్పు ఉన్నప్పటికీ పాదయాత్రకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైన విషయాన్ని హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక తెప్పించుకుంటామని ఆయన హామీ ఇచ్చారని కనకమేడల వివరించారు.