పోలీసులకు చిక్కిన జానీ మాస్టర్
గోవాలో పట్టి వేత
అక్కడ కోర్టులో హాజరు
నేడు హైదరాబాద్ కు తీసుకురానున్న టాస్క్ ఫోర్స్ …
డ్యాన్సర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ పై ఇప్పటికే ఐపీసీ సెక్షన్ 376, 506, 323(2) కింద కేసులు నమోదయ్యాయని తెలిసిందే. ఆ తర్వాత అతడిపై పోక్సో కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ కోసం గాలింపు ముమ్మరం చేసిన సైబరాబాద్ పోలీసుల బృందం ఫైనల్‌గా జానీమాస్టర్‌ను గోవాలో అరెస్ట్ చేశారు. గోవా కోర్టులో ఆయనని పోలీసులు హాజరుపరిచారు.. తెలంగాణ పోలీసులు.. అక్కడి నుంచి అతడిని పీటీ వారెంట్ కింద హైదరాబాద్‌కు తీసుకురానున్నారు..
కాగా జానీ మాస్టర్ బెంగళూరు నుంచి గోవా వెళ్లినట్టు గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసేందుకు ఎస్‌వోటీ, నార్సింగి పోలీసులు రంగంలోకి దిగి ఆపరేషన్ చేపట్టారు. గోవాలో ఉన్నట్టు ట్రాక్ చేశారు. అక్కడ ఓ లాడ్జ్‌లో ఉన్నట్టు నిర్ధారించుకొని ఎస్‌వోటీ పోలీసులు వెళ్లి పట్టుకున్నారు. బాధిత యువతి కేసు పెట్టిన నాటి నుంచి 5 రోజులుగా జానీ మాస్టర్ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. పరారవడంతో చాకచక్యంగా వివరాలు సేకరించి అతడి ఆచూకీని కనిపెట్టారు.
కాగా, నార్సింగి పోలీసులు ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటికే బాధితురాలి వాంగ్మూలం తీసుకున్నారు. బాధితురాలికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఇప్పటికే పోలీసులు బాధితురాలి ఇంట్లోనే విచారించి వివరాలు సేకరించారు. జానీ మాస్టర్ తనపై అత్యాచారం చేసి దాడి చేశాడని.. షూటింగ్ టైంలో క్యారవాన్‌లో బలవంతం చేశాడని బాధితురాలు తన స్టేట్‌మెంట్‌లో పేర్కొంది.
కోరిక తీర్చమని నన్ను ఎంతో వేధించాడని..తన మాట వినకపోతే ఆఫర్లు రాకుండా చేస్తానని బెదిరించాడని, పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ తనపై ఒత్తిడి చేశాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. కాగా పని ప్రదేశాల్లో వేధింపులు ఉన్నాయంటూ బాధితురాలు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ని ఆశ్రయించిందని తెలిసిందే.
ఈ ఘటనపై టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానల్ అధ్యక్షురాలు ఝాన్సీ స్పందిస్తూ.. మా పరిధిలో మేం విచారణ పూర్తి చేశాం. ఇద్దరి వాదనలు విన్నాం. 90రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని రిపోర్ట్ చేస్తాం. ఇలాంటి వ్యవహారాలపై పరిశ్రమకు చెందిన ఎవరు కైంప్లెంట్ చేసినా.. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.