Tuesday, November 26, 2024

ఖాతాదారులకు పీఎన్‌బీ షాక్‌, వడ్డీ రేట్లు తగ్గిస్తూ నిర్ణయం.. 10లక్షల్లోపు వాటికి వర్తింపు..

ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ఖాతాదారులకు షాక్‌ ఇచ్చింది. సేవింగ్స్‌ ఖాతాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ పీఎన్‌బీ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.10లక్షల లోపు బ్యాంక్‌ బ్యాలెన్స్‌ ఉన్న ఖాతాలపై వడ్డీ రేట్లను ఏడాదికి 2.70 శాతానికి తగ్గించినట్టు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ప్రకటించింది. అదే సమయంలో రూ.10లక్షల నుంచి రూ.500 కోట్ల మధ్య బ్యాలెన్స్‌లు మెయింటైన్‌ చేసే ఖాతాలపై వడ్డీ రేట్లను ఏడాదికి 2.75 శాతానికి తగ్గించింది. కొత్త రేట్లు ఏప్రిల్‌ 4వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. ఈ రూల్స్‌ దేశీయ, ఎన్‌ఆర్‌ఐ కస్టమర్లకూ వర్తిస్తాయని పీఎన్‌బీ అధికారిక ప్రకటనలో తెలియజేసింది. ఈ కొత్త నియమం ద్వారా లక్షలాది డిపాజిటర్లపై ప్రభావం పడనుంది. మరీ ముఖ్యంగా రూ.10లక్షలు, అంతకంటే తక్కువ బ్యాలెన్స్‌ ఉన్న కస్టమర్లకు ఎఫెక్ట్‌ పడుతుంది.

రెండు నెలల వ్యవధిలో రెండోసారి..

ఖాతాదారుల సేవింగ్స్‌ అకౌంట్లపై పీఎన్‌బీ వడ్డీ రేట్లు తగ్గించడం, గత రెండు నెలల వ్యవధిలో ఇది రెండోసారి. అంతకుముందు, ఫిబ్రవరిలో ప్రభుత్వ రంగ సెక్టార్‌ బ్యాంకులు తమ కస్టమర్ల పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు తగ్గింపును ప్రకటించారు. రూ.10లక్షల వరకు బ్యాలెన్స్‌ ఉన్న ఖాతాలకు వడ్డీ రేటు 2.75 శాతంగా, రూ.10లక్షల నుంచి రూ.500 కోట్ల లోపు ఉన్న పొదుపు ఖాతాలకు ఏడాదికి 2.80 శాతం వడ్డీగా నిర్ణయించాయి. అటు మినిమమ్‌ బ్యాలెన్స్‌ విషయంలోనూ పీఎన్‌బీ పెనాల్టిdలను భారీగా పెంచింది. రూ.100 జరిమానా.. రూ.250కు పెంచింది. అలాగే పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మెట్రో నగరాలు, పట్టణ ప్రాంతాల్లో త్రైమాసిక సగటు బ్యాలెన్స్‌ (క్యూఏబీ) పరిమితిని రూ.5000కు పెంచింది. గ్రామీణ, సెమీ అర్బన్‌, మెట్రో నగరాలతో సహా అన్ని ప్రాంతాల్లో పీఎన్‌బీ.. లాకర్‌ ఛార్జీలను సైతం పెంచేసింది. చెక్కుల చెల్లింపులపై కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 4వ తేదీ నుంచి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు చెక్కుల చెల్లింపులపై కొత్త రూల్‌ అమల్లోకి తీసుకొచ్చింది. రూ.10లక్షలు అంతకంటే ఎక్కువ చెక్కు చెల్లింపుల కోసం కచ్చితంగా పాజిటివ్‌ పే సిస్టమ్‌ (పీపీఎస్‌)ని అమలు చేసింది. ఈ నిబంధన కారణంగా చెక్కు మోసాలు తగ్గుతాయని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement