Tuesday, November 26, 2024

పీఎన్‌బీ స్కాం, నీరవ్‌ అనుచరుడు అరెస్టు.. కైరోలో పట్టుబడ్డ శంకర్‌ పరబ్‌

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు భారీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్‌ మోడీ ప్రధాన అనుచరుడు సుభాష్‌ శంకర్‌ పరబ్‌ను భారత్‌కు తీసుకొచ్చినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఈజిప్టు రాజధాని కైరోలో తలదాచుకున్న అతడిని అక్కడి ప్రభుత్వంతో దౌత్యపరంగా, చట్టపరంగా చర్చలు జరిపి.. ముంబైకు తీసుకొచ్చారు. పీఎన్‌బీ రూ.13,500 కోట్లు ఎగవేసిన కేసులో నీరవ్‌ మోడీతో పాటు పరబ్‌ కూడా ఓ నిందితుడు. నీరవ్‌కు చెందిన ఫైర్‌స్టార్‌ డైమండ్‌ కంపెనీ ఫైనాన్స్‌ విభాగంలో డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌గా పరబ్‌ వ్యవహరించేవాడు. పీఎన్‌బీకి సమర్పించిన నకిలీ లెటర్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్స్‌ ఇతడినే ప్రత్యక్ష సాక్షి అని సీబీఐ భావిస్తున్నది.


లండన్‌ జైల్లో నీరవ్‌ మోడీ
ప్రధాన నిందితుడిగా ఉన్న నీరవ్‌ మోడీ.. ప్రస్తుతం లండన్‌లో జైలు జీవితం గడుపుతున్నాడు. ఇక పరారీలో ఉన్న పరబ్‌ కైరో శివారులో ఉన్న ఓ రహస్య ప్రాంతంలో ఉన్నట్టు భారత అధికారులకు సమాచారం అందింది. ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న అతని భద్రతకు ప్రమాదం ఉందని పసిగట్టి వెంటనే ఈజిప్టు ప్రభుత్వంతో చర్చలు జరిపింది. ఆ తరువాత ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించి శంకర్‌ను అదుపులోకి తీసుకుంది. సుభాష్‌ను ముంబై సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. విచారణ నిమిత్తం కస్టడీకి కోరనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement