Saturday, November 23, 2024

ఢిల్లీలో ప్రధాని రోడ్ షో.. ఏపీలో మేం చేస్తే నేరమా? : పయ్యావుల కేశవ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశ రాజధాని న్యూఢిల్లీ నగరం నడిబొడ్డున స్వయానా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రోడ్ షో నిర్వహించగలిగారని, కానీ ఆంధ్రప్రదేశ్‌లో మారుమూల గ్రామంలో సైతం రోడ్ షో చేసే స్వేచ్ఛలేకుండా పోయిందని తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి పార్టీ తరఫున హాజరైన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ జీవో ఎమర్జెన్సీ నాటి నిషేధాజ్ఞల కంటే దారుణమని అభివర్ణించారు. అప్పట్లో సభలు, సమావేశాలు పెట్టినవారిపై కేసులు పెట్టారని, ఇప్పుడు సభ పెట్టకముందే ఇంటి నుంచి అడుగు బయటకు పెట్టకముందే కేసులు పెడుతున్నారని పయ్యావుల మండిపడ్డారు.

రాష్ట్రంలో భారత రాజ్యాంగం అమల్లో లేదని, ముస్సోలినీ – హిట్లర్ రాజ్యాంగాలను అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. జీవో ద్వారా ప్రతిపక్షాల వాక్ స్వాతంత్ర్యాన్ని హరించాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ సభలు పెడుతుంటే వైఎస్సార్సీపీ నేతలు భయపడుతున్నారని, చంద్రబాబు సభలకు వస్తున్న జన ప్రభంజనాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే ఇలాంటి జీవోలు తీసుకొచ్చి అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. అయినా సరే తాము వెనక్కి తగ్గేదే లేదని, నారా లోకేశ్ పాదయాత్ర అనుకున్న విధంగానే జరుగుతుందని చెప్పారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఏ చట్టం ప్రకారం ఎలాంటి కేసులు పెట్టినా ఖాతరు చేసే ప్రసక్తే లేదని అన్నారు. అవసరమైతే తెలుగుదేశం శ్రేణులు ‘జైల్ భరో’కు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement