కూటమి ప్రభుత్వ ఏర్పాటైన తర్వాత తొలి టూర్
ఏకంగా రూ.85 వేల కోట్ల విలువైన ప్రాజెక్ట్ లకు శంకుస్థాపన
విశాఖ రైల్వే జోన్ భవన నిర్మాణానికి భూమి పూజ
పూడిమడకలో ఎన్టీపీసీకి ఏర్పాటునకు అంకురార్పణ
నక్కపల్లిలో స్టీట్ ప్లాంట్ కు శంకుస్థాపన
మోదీతో పాల్గొననున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్
వెలగపూడి – ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక్కసారి కూడా రాష్ట్రానికి రాలేదు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన లేదు. తాజాగా దానికి ముహూర్తం ఫిక్స్ అయింది. నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటన ఖరారైంది. వచ్చే ఏడాది అంటే 2025 జనవరి 8న ఏపీకి రానున్నారు.
రూ.85 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన
ఉత్తరాంధ్రలో పర్యటించనున్న మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటనలో రూ.85 వేల కోట్ల విలువైన పనులకు భూమి పూజ చేయనున్నారు. విశాఖ రైల్వే జోన్‌తో సహా అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఎన్టీపీసీకి శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు నక్కపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్, ఏపీ జెన్కో గ్రీన్ హైడ్రోజన్ హబ్‌తో సహా మరెన్నో తదితర నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు.
ఈ ప్రాజెక్టుల ఎంతో మంది ఉపాధి అవకాశాలు పొందనున్నారు. దీని ద్వారా దాదాపు 25 వేల మందికి ప్రత్యక్షంగానూ, మరో 40 వేల మందికి పరోక్షంగానూ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి మోదీ రాష్ట్రానికి రానుండటంతో మంత్రి నారా లోకేష్ సహా ఎంపీ సీఎం రమేశ్ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
జనవరి 8న జరగబోయే ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు. ఇదిలా ఉంటే వాస్తవానికి ప్రధాని మోదీ నవంబర్‌లోనే రాష్ట్ర పర్యటనకు వచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. దాని కోసం నవంబర్‌లో షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది.
కానీ అప్పుడు తుపాను రావడంతో ఆయన పర్యటన రద్దయింది. ఆ తర్వాత నవంబర్ 29కి వాయిదా పడింది. అప్పటికీ తుపాను ప్రభావం ఉండటంతో రెండోసారి కూడా వాయిదా పడింది. ఇప్పుడు మళ్లీ జనవరి 8న ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది.