Monday, November 25, 2024

Delhi | ప్రాణనష్టానికి తావివ్వొద్దు.. భీకర తుఫాను ‘బిపర్‌జోయ్‌’ ఏర్పాట్లపై ప్రధాని సూచనలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ప్రచండ గాలులతో విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్న భీకర తుఫాను ‘బిపర్‌జోయ్’ కారణంగా జరిగబోయే ఆస్తినష్టాన్ని వీలైనంతగా నివారిస్తూ, ప్రాణనష్టం ఏమాత్రం లేకుండా తగు చర్యలు చేపట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారులకు సూచించారు. ఈ తుఫాను ప్రభావం, సన్నద్ధతపై సోమవారం ఆయన అత్యున్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తుఫాను ప్రభావిత ప్రాంతంలో ప్రమాదం అంచున ఉన్న ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. తుఫాను గాలులతో జరిగే విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకుని తుఫాను వెలిసిన వెంటనే వేగంగా పునరుద్ధరించేలా సంసిద్ధంగా ఉండాలని సూచించారు.

కేవలం మనుషులే కాదు, జంతువులకు కూడా భద్రత కల్పించాలని ప్రధాని అధికారులను కోరారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం సురక్షితంగా తరలించేలా తగిన సహకారం అందించాలని, అలాగే విద్యుత్, టెలికమ్యూనికేషన్స్, ఆరోగ్యం, తాగునీరు మొదలైన అన్ని అవసరమైన సేవలకు కలిగే విఘాతాన్ని అంచనా వేసుకుని, తక్షణమే పునరుద్ధరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీనియర్ అధికారులను ప్రధాన మంత్రి ఆదేశించారు. ఇందుకోసం ఏర్పాటు చేసే కంట్రోల్ రూమ్‌లు నిరంతరం విరామం లేకుండా ప‌నిచేయాల‌ని ఆదేశించారు.

- Advertisement -

భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం జూన్ 15 మధ్యాహ్నానికి జాఖౌ పోర్ట్ (గుజరాత్) సమీపంలోని మాండ్వి (గుజరాత్) మరియు కరాచీ (పాకిస్తాన్) మధ్య సౌరాష్ట్ర – కచ్ ప్రాంతాల మీదుగా ‘బిపర్‌జోయ్’ తీరం దాటనుంది. తీరం దాటే సమయానికి అతి తీవ్ర తుఫానుగా గంటకు సగటున 125-135 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, గరిష్టంగా గంటకు 145 కి.మీ వేగం వరకు వాటి తీవ్రత ఉంటుందని వెల్లడించింది. తీరం దాటడానికి రెండ్రోజులు ముందు 14-15 తేదీలలో గుజరాత్‌లోని కచ్, దేవభూమి ద్వారక, జామ్‌నగర్‌లలో అతి భారీ వర్షాలు కురుస్తాయని, గుజరాత్‌లోని పోర్‌బందర్, రాజ్‌కోట్, మోర్బి & జునాఘర్ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు సహా గుజరాత్‌లోని కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ వాతావరణ సూచనలు, హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రధాన మంత్రి అధికారులను ఆదేశించారు. వివిధ శాఖలు, విభాగాల మధ్య సమన్వయం చేస్తూ కేంద్రం హోం మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిరంతరం సమీక్షించాలని సూచించారు. తుఫాను ప్రభావిత రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత కేంద్ర ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 12 జాతీయ విపత్తు సహాయక బృందాలు (ఎన్డీఆర్ఎఫ్) బృందాలను ముందస్తుగా గుజరాత్ తీరం వెంట సిద్ధంగా ఉంచినట్టు తెలిపారు. ఈ బృందాలు పడవలు, ట్రీ-కట్టర్లు, టెలికాం పరికరాలతో సహా సిద్ధంగా ఉన్నాయని, మరో 15 బృందాలను అవసరం మేర రంగంలోకి దించేందుకు రిజర్వులో ఉంచినట్టు వెల్లడించారు.

అలాగే రక్షణశాఖకు చెందిన నావికాదళం, కోస్ట్ గార్డ్ సిబ్బందిని రెస్క్యూ కార్యకలాపాల కోసం నౌకలు, హెలికాప్టర్లతో సిద్ధం చేసినట్టు అధికారులు తెలిపారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఇంజనీర్ టాస్క్ ఫోర్స్ యూనిట్లు, పడవలు, రెస్క్యూ పరికరాలతో సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. సముద్ర తీరం వెంబడి నిఘా విమానాలు, హెలికాప్టర్లు నిఘాను నిర్వహిస్తున్నాయని వెల్లడించారు. ఆర్మీ, నేవీ, కోస్ట్ గార్డ్‌ల విపత్తు సహాయ బృందాలతో పాటు వైద్య బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు. తుఫానును ఎదుర్కొనేందుకు గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి కూడా ప్రధానికి అధికారులు వివరించారు.

ముఖ్యమంత్రి స్థాయిలో జిల్లా యంత్రాంగంతో సమీక్షా సమావేశాలు నిర్వహించి ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర పాలనా యంత్రాంగం మొత్తం సన్నద్ధమైందని తెలిపారు. అలాగే క్యాబినెట్ సెక్రటరీ, హోం సెక్రటరీ గుజరాత్ ముఖ్య కార్యదర్శితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని ప్రధానికి తెలిపారు. ఈ సమావేశంలో హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ, క్యాబినెట్ సెక్రటరీ, వాతావరణ శాఖ డైరక్టర్ జనరల్ సహా సీనియర్ అధికారులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement