ప్రముఖ తమిళ హాస్య నటుడు వివేక్ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. గుండెపోటుతో చెన్నైలోని సిమ్స్ ఆసుపత్రిలో చేరిన వివేక్.. శనివారం తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. వివేక్ హఠాన్మరణం ఎందరినో శోకసంద్రంలో ముంచిందని మోదీ పేర్కొన్నారు.
‘‘తన నటన, హాస్యంతో నటుడు వివేక్ కోట్ల మందిని అలరించారు. పర్యావరణం, సమాజంపై ఆయనకున్న ప్రేమ ఇటు సినిమాల్లోనూ అటు వ్యక్తిగత జీవితంలోనూ కనిపించేది. ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులు, ఆయన్ను ఆరాధించేవారికి సానుభూతి తెలియజేస్తున్నా. ఓం శాంతి’’ అంటూ మోదీ ట్వీట్ చేశారు.
కాగా, గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన హాస్య నటుడు వివేక్ శనివారం తెల్లవారుజామున 5 గంటలకు కన్నుమూశారు. ఆయన వయసు 59 సంవత్సరాలు. గురువారం కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వివేక్.. నిన్న ఉదయం శ్వాస ఆడడం లేదని చెబుతూనే తన ఇంట్లో కిందపడి స్పృహ కోల్పోయారు. దీంతో ఆయనను వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతుండగా ఈ తెల్లవారుజామున పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. వివేక్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉండగా, ఆరేళ్ల క్రితం డెంగీ జ్వరంతో ఓ కుమారుడు మృతి చెందాడు.