Saturday, November 23, 2024

ఈనెల 24న మోదీ నేతృత్వంలో సీబీఐ చీఫ్ ఎంపికపై కసరత్తు

న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తదుపరి చీఫ్ నియామకం కోసం కసరత్తు ఈ నెల 24న జరుగుతుంది. విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ ఈ నెల 24న సమావేశమవుతుంది. ఈ సమావేశంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌‌వీ రమణ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి పాల్గొంటారు. మాజీ సీబీఐ డైరెక్టర్ రుషికుమార్ శుక్లా పదవీకాలం ఫిబ్రవరి 3న ముగిసింది. ఆ తర్వాత 1988 బ్యాచ్ గుజరాత్ కేడర్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సిన్హా తాత్కాలిక సీబీఐ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. పూర్తి కాలపు సీబీఐ డైరెక్టర్‌ను నియమించే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.

సీబీఐ చీఫ్ పదవి కోసం 1984, 1985, 1986 బ్యాచ్ అధికారులను పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. అయితే రాకేశ్ ఆస్థానా, వైసీ మోదీ, సుబోధ్ జైశ్వాల్ ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం. సుబోధ్ జైశ్వాల్ 1985 బ్యాచ్ అధికారి. ఆయన ప్రస్తుతం డీజీ సీఐఎస్ఎఫ్‌గా పని చేస్తున్నారు. రాకేశ్ ఆస్థానా 1984 బ్యాచ్ అధికారి, ప్రస్తుతం డీజీ బీఎస్ఎఫ్‌గా పని చేస్తున్నారు. వైసీ మోదీ 1984 బ్యాచ్ అధికారి, ప్రస్తుతం ఎన్ఐఏ చీఫ్‌గా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement