బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుమారుడికి మోదీ ఫోన్ చేసి పరామర్శించారు. తెలుగులో ట్వీట్ చేశారు. జంగారెడ్డి తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేశారని ప్రధాని మోదీ అన్నారు. జనసంఘ్, బీజేపీని విజయ శిఖరాలకు చేర్చే ప్రయత్నాలలో ఆయన అంతర్భాగంగా ఉన్నారని గుర్తు చేసుకున్నారు. ఎందరో ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. ఆయన చాలా మంది కార్యకర్తలను కూడా ప్రేరేపించాడని, ఆయన మృతి తీరని లోటు అని ప్రధాని విచారం వ్యక్తం చేశారు. ”జంగా రెడ్డి బీజేపీ క్లిష్టమైన దశలో ఉన్నప్పుడు సమర్థవంతమైన వాణిని అందించారు. ఆయన కుమారుడితో మాట్లాడి సంతాపం తెలపడం జరిగింది. ఓం శాంతి.’’ అని ట్వీట్ చేశారు.
బీజేపీ సీనియర్ నేత అయిన చందుపట్ల జంగారెడ్డి (87) అనారోగ్య కారణాలతో ఈ రోజు ఉదయం కన్నుమూశారు. వరంగల్ జిల్లా పరకాలకు చెందిన జంగారెడ్డి.. 1984లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరుపున గెలుపొందారు.
నాడు దేశంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎంపీలలో చందుపట్ల జంగారెడ్డి ఒకరు. హనుమకొండ పార్లమెంట్ స్థానం నుంచి మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై భారీ మెజారిటీతో ఆయన గెలవడం గమనార్హం. ఆ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్, ఉమ్మడి ఏపీ వ్యాప్తంగా తెలుగు దేశం పార్టీ తిరుగులేని మెజార్టీతో గెలుపొంది సత్తా చాటగా, బీజేపీ ఏ మాత్రం రాణించలేకపోయింది. ఆ సమయంలో బీజేపీ నుంచి గెలుపొందిన నాయకుడిగా జంగారెడ్డి రికార్డు సృష్టించారు.
కాగా, జంగారెడ్డి రాజకీయాల్లోకి రాకముందు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగానూ పనిచేశారు. ఆయన మృతి పట్ల సీఎం కేసీఆర్, బీజేపీ నేతలు సంతాపం తెలిపారు.