ఇవాళ ప్రధాని మోదీ ఉత్తరాఖండ్, రాజస్థాన్‌లలో బీజేపీ లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్ జిల్లాలోని రుద్రపూర్తో పాటు రాజస్థాన్‌లోని జైపూర్ రూరల్‌లోని కోట్‌పుట్లీలో నిర్వహించే బీజేపీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని ర్యాలీకి భద్రత కల్పించేందుకు పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది.
ఇక, ఉత్తరాఖండ్‌లోని ఐదు లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19న తొలి దశలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం, ఉత్తరాఖండ్‌లోని మొత్తం ఐదు స్థానాలు 2014 నుంచి బీజేపీనే విజయం సాధిస్తుంది. అలాగే, ఆ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, బీజేపీ అభ్యర్థులతో పాటు రాష్ట్ర అధికారులు హాజరుకానున్నారు. ప్రధాని మోడీ ఉత్తరాఖండ్‌లో తన కార్యక్రమాన్ని ముగించుకుని రాజస్థాన్‌కు బయలు దేరుతారు.
ఇక, ప్రధాన మంత్రి వచ్చే వేదిక దగ్గర ఎలాంటి హ్యాండ్‌బ్యాగ్‌లు, మండే పదార్థంతో పాటు ఇతర వస్తువులను నిషేధించాలని పోలీసులు ఆదేశించారు. ఈ సందర్భంగా ఐజీ విజిలెన్స్ కేకే వీకే, డీఐజీ కుమాం రేంజ్ యోగేంద్ర రావత్, ఎస్ఎస్పీ మంజునాథ్ టీసీ, 46వ కార్ప్స్ పీఏసీ కమాండర్ పంకజ్ భట్, ఎస్పీ క్రైం చంద్రశేఖర్ ఘోడ్కేతో పాటు పలువురు పోలీసు అధికారులు, ఉద్యోగులు ప్రధాని మోడీ భద్రత ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.