హైదరాబాద్, ఆంధ్రప్రభ : పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద లబ్దిపొందడం రైతులకు సవాల్‌గా మారింది. అయిదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.6వేలను పెట్టుబడిసాయంగా అందజేస్తోంది. మూడు విడతలుగా విడతకు రూ.2వేల చొప్పున అందజేస్తోంది. అయితే తాజాగా ఆధార్‌కార్డుతో బ్యాంకు ఖాతాను అనుసంధానం చేస్తేనే కిసాన్ సమ్మాన్ నిధులు జమచేస్తామని కొర్రీ పెట్టింది. దీంతో రైతులు ఈకేవైసీ ఎలా చేయించుకోవాలో అర్థం కాక అనేక బ్బందులు పడుతున్నారు. ఈకేవైసీని నమోదుకు రైతులకు ఈ నెల 31వరకు కేంద్ర ప్రభుత్వం గడువు ఇచ్చింది. డిసెంబరు 15 వరకే ఈకేవైసీ నమోదుకు గడువు ఇవ్వగా మరో 15 రోజులపాటు పొడిగించింది. ఈ కేవైసీ పూర్తి చేసుకున్న రైతులకు మాత్రమే పీఎం కిసాన్ నిధులు ఏడాదికి రూ.6వేలు అందనున్నాయి.
ఇలా ఈవైకేసీ పూర్తి చేయాలి…
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కోసం ఈకేవైసీ ధృవీకరణకు రైతులు పీఎం కిసాన్ పోర్టల్ ఉచిత యాప్ ద్వారా, మీ సేవ కేంద్రాల్లో మండల వ్యవసాయ అధికారుల ద్వారా నమోదు చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ ఉన్న రైతులు కేంద్ర ప్రభుత్వం సూచించిన లింకును ఓపెన్ చేసి అనుసంధానం చేసుకునే వీలుంది. లింక్‌పై క్లిక్ చేసి ఆధార్ నంబరును నమోదు చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆధార్ లింకుతో ఉన్న సెల్ నంబరుకు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి గెట్ పీఎం కిసాన్ ఓటీపీ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
సెల్ ఫోన్‌కు వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేస్తే ఈకేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హులైన ప్రతీ రైతు ఆధార్ నంబరును అనుసంధానం చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. గ్రామాల్లో రైతులకు ఏవో, ఏఈవోల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఈ నెలాఖరులోపు ఈకేవైసీ నమోదును 100శాతం పూర్తి చేయడమే లక్ష్యంగా వ్యవసాయశాఖ అధికారులు ముందుకు వెళుతున్నారు.