హైదరాబాద్, ఆంధ్రప్రభ : అన్నదాతలను అడుగడుగునా మోసం చేస్తూ.. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణలో రైతు రుణమాఫీపై ప్రధాని మోదీ విమర్శలు చేయడం సరికాదని రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి సీతక్క మండిపడ్డారు. మహారాష్ట్ర సభలో తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాన నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు ప్రధాని మోడీకి లేదని తేల్చి చెప్పారు. పదేళ్ల పాలనలో రైతులకు పైసా రుణమాఫీ చేయని ప్రధాని, తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నల్ల చట్టాలు తెచ్చి అన్నదాతలకు నరకం చూపిన వ్యక్తి ప్రెధాని మోదీ అని మండిపడ్డారు.
ఢిల్లీ నడి వీధుల్లో 700 మంది రైతుల మరణానికి కారణం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అని దుయ్యబట్టారు. రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీలను విస్మరించడంలో ప్రధాని మోదీ ముందు వరుసలో ఉంటారని ధ్వజమెత్తారు. 60 ఏళ్లు దాటిన రైతులకు పెన్షన్ ఇస్తామని 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చారని, రైతులకు పింఛన్ అని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేశారని, కానీ అయిదేళ్లు గడిచినా అది కార్యరూపం దాల్చలేదన్నారు.
కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు పెట్టబడి సాయం పెంచుతామని హామీ ఇచ్చి విస్మరించారని అన్నారు. సెస్‌ల పేరుతో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి రైతులపై పంట ఖర్చుల భారాన్ని మోపారని విమర్శించారు. పంట ఖర్చులకు అనుగుణంగా కనీస మద్దతు ధరను పెంచలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధాని పంటల బీమా పథకంలో కేంద్ర ప్రభుత్వ వాటా నిధులను తగ్గించారని…… చివరకు ఎరువులు, క్రిమిసంహారక రసాయనాలపైనా సబ్సీడీని తగ్గించి రైతులపై మోయలేని బారం మోపారని విమర్శించారు. కానీ ఏకకాలంలో 23 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర తెలంగాణలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానిదని ప్రధానికి గుర్తు చేశారు. సాంకేతిక సమస్యలతో రుణమాఫీ కానీ రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ప్రకటించారు.