న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కౌలు రైతులకు కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద అన్ని ప్రయోజనాలను వర్తింపజేస్తున్నామని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. విత్తనాలు, ఎరువులు, రుణాలు ఇస్తున్నామని, ఏ కేటగిరీ రైతులనైనా దీనికి అర్హులేనని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి వెల్లడించారు. వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్ కౌలు రైతుల సమస్యలను మంగళవారం లోక్‌సభలో ప్రస్తావించారు. వాతావరణ మార్పుల వల్ల నష్టపోతున్న కౌలు రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని వారికీ వర్తింపజేయాలని కోరారు.
2016 నీతి ఆయోగ్ సూచించిన అగ్రికల్చర్ మోడల్ యాక్ట్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటని గోరంట్ల మాధవ్ ప్రశ్నించారు. అగ్రికల్చర్ మోడల్ యాక్టును అన్ని రాష్ట్రాలకు పంపించామని కేంద్రమంత్రి కైలాష్ చౌదరి జవాబిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ రైతుల ప్రయోజనం కోసం ప్రత్యేక చట్టాలను తయారుచేసుకుందని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. వాటి ద్వారా రైతులకు అన్యాయం జరగకుండా చర్యలు చేపడుతోందని అన్నారు.