హైదరాబాద్, ఆంధ్రప్రభ : రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని మినిరత్న పిఎస్‌యూలో భాగంగా నేడు ప్రైమ్ మినిస్టర్ వైఫై యాక్సెస్ నెట్‌వర్క్ ఇంటర్‌ఫేస్ (పిఎమ్ – డబ్ల్యుఎఎన్‌ఐ)ను ప్రారంభించిన రైల్‌టెల్ ఒక కీలక మైలురాయిని అధిగమించింది. ఈ పథకం కింద 2384 హాట్‌స్పాట్లతో 100 రైల్వే స్టేషన్లలో ప్రజలకు వైఫై సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.ఈ స్టేషన్లు 22 రాష్ట్రాల పరిధిలో ఉన్నాయి. వీటిలో 71 స్టేషన్లు ‘ఏ1’, ‘ఏ’ కేటగిరీకు చెందినవి కాగా 29 ఇతర కేటగిరి స్టేషన్లకు చెందినవి. రైల్‌టెల్ సీఎండీ పునీత్ చావ్లా ఈ ప్రజా స్నేహ పూర్వక సేవలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వ అటానమస్ టెలికాం ఆర్ అండ్ డి సంస్థ సెంటర్ ఆఫ్ డవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సి – డిఓటి) ఈడీ, చైర్మన్ డాక్టర్ రాజ్‌కుమార్ ఉపాధ్యాయ పాల్గొన్నారు.
రైల్‌టెల్ దేశంలో 17,792 వైఫై హాట్‌స్పాట్లతో 6102 రైల్వే స్టేషన్లలో విస్తరించబడిందని తెలిపారు. ఇది మరింత పురోగతిలో సాగనుంది. దశల వారిగా 2022 జూన్ చివరి నాటికి విస్తరిస్తామన్నారు. జూన్ 10 తేదీ నాటికి మొత్తం 1000 స్టేషన్లలో, 20 జూన్ నాటికి 3000 స్టేషన్లలో, 30 జూన్ 2022 నాటికి 6102 స్టేషన్లలో వైఫై అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ పథకం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఐదు రైల్వే స్టేషన్లలో అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు. ఏ1 కేటగిరి కింద హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ, ఏ కిటగిరి కింద తెనాలి, గుంటూరు స్టేషన్‌లలో అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు..
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..