Thursday, November 21, 2024

మార్కెట్‌ ధరలకే సామాన్యులకు ప్లాట్లు.. హైదరాబాద్‌ శివార్లలో అమ్మకానికి పెట్టిన హెచ్‌ఎండీఏ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా నగర శివారు ప్రాంతాల్లో ఉన్న ల్యాండ్‌ ప్లాట్లను మార్కెట్‌ ధరకే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకు లోబడి హెచ్‌ఎండీఏ ల్యాండ్‌ ప్లాట్లను పారదర్శకంగా ఆన్‌లైన్‌ పద్ధతిలో వేలం ద్వారా అమ్మకానికి పెట్టింది. ఎంఎస్‌టీసీ ద్వారా ఆన్‌లైన్‌ పద్ధతిలో వేలం నిర్వహించనుంది. ప్రస్తుతం 3 జిల్లాల పరిధిలో అవుటర్‌ రింగ్‌రోడ్డుకు దగ్గరలో అమ్మకానికి 39 ల్యాండ్‌ పార్సల్స్‌ అందుబాటులో ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 10, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 6, సంగారెడ్డి జిల్లాలో 23 ల్యాండ్‌ పార్సెళ్ల కొనుగోలుదారుల కోసం సిద్ధంగా ఉంచారు. ప్లాట్లు ఉన్న ప్రాంతాలు(ల్యాండ్‌ పార్సిల్స్‌) కేఎంఎల్‌ ఫైల్‌ ద్వారా చూసుకునే సదుపాయం కల్పించారు. అందుబాటు ధరల్లో 121 గజాల నుంచి 10,164 గజాల వరకు స్థలాలు అందుబాటులో ఉన్నాయి.

- Advertisement -

ఏయే ప్రాంతాల్లో స్థలాలు…

రంగారెడ్డి జిల్లాలోని గండిపేట మండలంలో 3, శేరిలింగంపల్లి మండలంలో 5, ఇబ్రహీంపట్నం మండలంలో రెండు చోట్ల ల్యాండ్‌ పార్సల్స్‌ ఉండగా మల్కాజిగిరి జిల్లాలోని మేడిపల్లి మండలంలో 4, ఘట్‌కేసర్‌ మండలంలో ఒకటి, బాచుపల్లి మండలంలో ఒకటి చొప్పున ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండల పరిధిలో 16, ఆర్‌సీపురం మండలంలో 6, జిన్నారం మండలంలో ఒకటి చొప్పున ల్యాండ్‌ పార్సిల్స్‌ ఉన్నాయని అధికారులు వెల్లడించారు. మార్చి ఒకటో తేదీన మొత్తం 39 ల్యాండ్‌ పార్సిల్స్‌ను ఆన్‌లైన్‌ వేలం ద్వారా విక్రయించడానికి హెచ్‌ఎండీఏ సన్నాహాలు చేస్తోంది. వంద శాతం ఎలాంటి చిక్కులు లేని, క్లియర్‌ టైటిల్‌ ఉన్న ఈ భూములను కొనుగోలు చేసినవారు సత్వరమే నిర్మాణ అనుమతులు పొందడానికి అవకాశం ఉందని తెలిపారు. ఆన్‌లైన్‌ వేలంలో పాల్గొనేందుకుగాను ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఎంఎస్‌టీసీ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్‌ అయినవారు ఫిబ్రవరి 28న సాయంత్రం 5 గంటలలోపు నిర్దేశించిన డిపాజిట్‌ రుసుమును చెల్లించాల్సి ఉంటుందని హెచ్‌ఎండీఏ వెల్లడించింది.

రేపటి నుంచి ప్రీబిడ్‌ సమావేశాలు…

హెచ్‌ఎండీఏ వేలం వేస్తున్న ప్లాట్లపై కొనుగోలుదారులకు అవగాహన కల్పించేందుకు మంగళవారం నుంచి ప్రీబిడ్‌ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 21న రంగారెడ్డి జిల్లా ల్యాండ్‌ పార్సిల్స్‌పై శేరిలింగంపల్లి జోనల్‌ ఆఫీసులో 22న సంగారెడ్డి జిల్లా ల్యాండ్‌ పార్సిల్స్‌పై ఆర్సీపురంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో 23న మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ల్యాండ్‌ పార్సిళ్లపై ఉప్పల్‌ స్టేడియం వద్ద ఉన్న సర్కిల్‌ ఆఫీసులో ప్రీబిడ్‌ సమావేశాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement