Saturday, November 23, 2024

ఎన్ని ఆంక్షలు పెట్టినా వినాయసాగర్ లోనే గణేష్ నిమజ్జనం: బండి సంజ‌య్‌

టీఆర్ఎస్ పాలనలో హిందువులు భిక్షమెత్తుకునే దుస్థితి ఏర్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. హిందువులు జరుపుకునే పండుగలకు ఆంక్షల పేరుతో సీఎం కేసీఆర్ అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులంతా సంఘటితానికి ప్రతీకగా నిలిచే గణేష్ నిమజ్జనానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం లేదన్నారు. హిందువులంతా సంఘటితమైతే తన ఆటలు చెల్లవనే భావనతోనే వినాయకసాగర్ (ట్యాంక్ బండ్) వద్ద గణేష్ నిమజ్జనానికి తగిన ఏర్పాట్లు చేయకుండా హిందూ పండుగలకు ప్రాధాన్యత లేకుండా చేసే కుట్రకు తెరదీశారని అన్నారు. ఈ విషయంలో కొందరు మంత్రులు ఆడే అబద్దాలకు అంతు లేకుండా పోయిందని, ఈ విషయంలో సినిమా నటులను మించిపోతున్నారని అన్నారు. వినాయక్ సాగర్ వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాటు చేయకపోవడంతో వీహెచ్ పీ నేతలు దీక్షలు చేయడంతోపాటు బీజేపీ పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేశామన్నారు. తాను వినాయక్ సాగర్ పర్యటనకు బయలుదేరుతున్నట్లు ప్రకటించిన తరువాతే ప్రభుత్వం దిగొచ్చి ఆదరబాదరాగా వినాయక సాగర్ వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లు చేశారని అన్నారు. అవి కూడా తూతూ మంత్రంగా కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. గణేష్ ఉత్సవాల్లో భాగంగా బండి సంజయ్ ఈరోజు కరీంనగర్ లోని టవర్ సర్కిల్ వద్ద వినాయక మండపాలను సందర్శించారు. అక్కడ జరుగుతున్న గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఈసంద‌ర్భంగా బండి సంజ‌య్ మాట్లాడుతూ.. హిందూ బంధువులందరికీ గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు. విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పూజలందుకుని గణేస్ నిమజ్జనానికి సిద్ధమైన తరుణంలో కరీంనగర్ లోని టవర్ సర్కిల్ వేదికగా గణేష్ ఉత్సవ సమితి, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశాం. కరీంనగర్ లోని ప్రతి ఒక్కరూ నిమజ్జనం సందర్భంగా టవర్ సర్కిల్ వద్దకు వచ్చి ప్రశాంతంగా నిమజ్జనం జరుపుకోవాల‌న్నారు. గత ఏడాది పాదయాత్ర సందర్భంగా నిమజ్జన కార్యక్రమానికి హాజరుకాలేకపోయామ‌న్నారు. రేపటి నిమజ్జనంలో నేను పాల్గొంటా అన్నారు. హైదరాబాద్ లో కొంతమంది మంత్రుల అబద్దాలకు అంతు లేదు. నిన్న ఒక మంత్రి సినిమా యాక్టర్ మాదిరిగా నటిస్తున్నడు. వినాయక సాగర్ వద్ద నిమజ్జన ఏర్పాట్లు చేయాలని వీహెచ్ పీ దీక్షలు చేసింది.

బీజేపీ ఆందోళన కార్యక్రమాలు చేసింది. మేం వినాయక సాగర్ కు వస్తున్నామని చెప్పిన తరువాతే దిగొచ్చిన ప్రభుత్వం ఆదరబాదరాగా జేసీబీలు పెడుతూ మీడియాకు షో చూపే యత్నం చేస్తున్నరు. టీఆర్ఎస్ డ్రామాలకు అంతులేకుండా పోయింది. నిన్నటి డ్రామాను చూసి జనం నవ్వుకుంటున్నారు అన్నారు. నిన్న ఉదయం వరకు ఒక్క క్రేన్, జేసీబీ పెట్టలేదు. మేం దీక్షలకు దిగి వినాయక్ సాగర్ వస్తున్నానని చెప్పిన తరువాతే హడావుడిగా తూతూ మంత్రంగా జేసీబీలను ఏర్పాటు చేశారు. అది కూడా మట్టి వినాయకులు మాత్రమే ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనం చేస్తామని చెప్పారు. ఇప్పుడేమో అన్నీ చేయొచ్చంటున్నరు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని డ్రామాలు చేసినా వినాయక్ సాగర్ లో నిమజ్జనం చేసి తీరుతాం అన్నారు. టీఆర్ఎస్ పాలనలో హిందువులు భిక్షమెత్తుకునే దుస్థితి ఏర్పడింది. అందుకు ప్రతి ఒక్కరూ సద్దికట్టుకుని రావాలని హిందువులందరినీ కోరుతున్నా అన్నారు. అన్ని పండుగలకు సమీక్ష చేసే సీఎం గణేష్ నిమజ్జనం గురించి ఎందుకు సమీక్ష చేయలేదు అని మండిప‌డ్డారు. హిందువుల పండుగలకు ప్రాధాన్యతను తగ్గించాలని, తద్వారా హిందువులు సంఘటితం కాకుండా చీల్చాలని కుట్ర చేస్తున్నడు. సీఎం ఎన్ని కుట్రలు చేసినా ట్యాంక్ బండ్ వద్దే నిమజ్జనం చేస్తాం అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement