హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని వ్యవసాయ శాఖ కమిషనర్ ఎం.రఘునందన్ రావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటనను ఆయన విడుదల చేశారు. రాష్ట్రంలో గతేడాది ఇది రోజుల నాటికి 3.95 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిలువ ఉండగా, ఈ ఏడాది 4.52 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయన్నారు. ముందస్తు ప్రణాళికతో నిల్వలు చేయబడ్డాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం 4.52 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు టిఎస్ మార్కఫెడ్, డీలర్లు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, కంపెనీ గోదాములలో నిలువ చేయబడ్డాయని ఆయన వెల్లడించారు.
అలాగే జూన్ నెలలో రైతుల వినియోగానికి సరిపడ 1.69 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు రాష్ట్రంలో ఉన్నాయని ఆయన తెలిపారు. జూన్ మాసానికి అదనంగా 1.75 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి రానుందన్నారు. ఈ నేపథ్యంలో రైతులెవ్వరూ యూరియా కోసం ఆందోళన చెందవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదిలావుండగా రామగుండం ఎరువుల ఉత్పత్తి కార్మాగారంలో ఉత్పత్తి నిలిపివేయాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో వ్యవసాయ శాఖ దాన్ని త్వరతిగతిన పునరుద్ధరణకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..