ఎన్నికల వేళ మంత్రికి అడ్డం తిరిగాడు అంటే సంక్షేమ పథకం అందలేదనో.. అభివృద్ధి కార్యక్రమం జరగలేదనో… తన కుటుంబానికి ఏదో అన్యాయం జరిగిందనో.. నిలదీసేందుకే అనుకుంటున్నారా…! అయితే మీరు పప్పులో కాలేసినట్లే.. మంత్రికి ఓ చిన్నారి అడ్డం తిరిగి ముద్దుగా ప్లీజ్ ప్లీజ్ సార్ అని బతిమిలాడుతున్నాడు. ఎవరీ పిల్లాడు.. ఏం అడుగుతున్నాడో అర్థం కాక మంత్రి జగదీష్ రెడ్డి దగ్గరకు తీసుకొని నిదానంగా అడగగా తమ గల్లీలో ఏర్పాటు చేసిన కనకదుర్గ అమ్మవారి దగ్గర కొబ్బరికాయ కొట్టాలని కోరాడు.
అందుకు మంత్రి నవ్వుతూ స్పందిస్తూ ఆయన సతీమణి సునీతను సైతం తీసుకొని ఆ కుర్రాడి వెంట నడుస్తూ గల్లీలోకి వెళ్లారు. అమ్మ వారికి పూజ చేసి కొబ్బరికాయ కొట్టారు. మంత్రి రాక తో గల్లీలో ఒక్కసారి గా జనాలు రావడం, పూజలు చేస్తుండడం చూసి ఆ గల్లీ వాసులకు ఏం జరుగుతుందో, ఎవరొచ్చారో అర్థం కాలేదు. కొద్దిసేపటికి తేరుకున్న వారు మంత్రిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
అనంతరం ఆనందంతో గ్రూపులుగా ఫోటోలు దిగారు. తమకు అందుబాటులో ఉంటూ, తమ కుటు-ంబ సభ్యుడిలా మెలుగుతున్న మంత్రి మరోసారి గెలవాలని నినాదాలు చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంగళ వారం సాయంత్రం జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేసి బయటకు వచ్చి కారు ఎక్కుతున్న మంత్రికి అన్నాదురై నగర్ కు చెందిన ముజేఫా అనే మూడో తరగతి కుర్రాడు అడ్డం వచ్చి మంత్రిని నగర్ కు తీసుకెళ్లాడు.
మంత్రి అక్కడ నుండి వెళ్ళిన తర్వాత ముజేఫాను స్థానికులు అభినందనలతో ముంచెత్తారు. మంత్రిపై ఎందుకంత అభిమానం అని వారు అడగగా తాను అనారోగ్యానికి గురైతే నిలోఫర్ ఆసుపత్రి లో చికిత్స పొందేందుకు మంత్రి సహకరించాడని చెప్పాడు. మంత్రి పై ఆ చిన్నారికి ఉన్న విశ్వాసం, అభిమానానికి స్థానికులు ఆశ్చర్యపోయారు.