ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర మొదలై నెలలు గడుస్తోంది. దీంతో ఇప్పటికే భారత్ కు చెందిన పలువురు నిపుణులు, కార్మికులు అక్కడ ఉండలేక తిరిగి వచ్చేస్తున్నారు. ఇదే క్రమంలో ఓ అత్యవసర పరిస్ధితుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన డాక్టర్ కూడా ఉక్రెయిన్ నుంచి ఉన్నపళంగా తిరిగి వచ్చేశారు. ఆ హడావిడిలో తాను పెంచుకుంటున్న రెండు పెంపుడు జంతువుల్ని అక్కడే వదిలేయాల్సి వచ్చింది. రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో ఉన్న ఏపీకి చెందిన ఆర్థోపెడిక్ డాక్టర్ గిరికుమార్ ను అక్కడి సైన్యం యుద్ధ ప్రాంతం నుండి బలవంతంగా బయటకు పంపింది. అప్పుడు తన పెంపుడు జంతువుల్ని స్థానిక రైతు దగ్గర వదిలేసి వచ్చారు.
ఇప్పుడు అక్కడే మిగిలిపోయిన తన పెంపుడు జంతువులైన జాగ్వర్, చిరుతపులిని రక్షించడంలో సాయం చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు డాక్టర్ గిరికుమార్. ఈ చిరుతపులి, జాగ్వార్ రెండూ అరుదైన జాతికి చెందిన జంతువులని తెలిపారు. కైవ్‌లోని భారత రాయబార కార్యాలయం సాయం చేయలేకపోవటంతో ఇక్కడికి చేరుకున్న తర్వాత తనకు సాయం చేయాలని భారత ప్రభుత్వాన్ని ఆయన కోరుతున్నారు. తన పెంపుడు జంతువుల ప్రస్తుత పరిస్ధితి దృష్టిలో ఉంచుకుని వాటిని భారత్ కు తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.