Tuesday, November 26, 2024

TS | ఈఎన్‌టీ టవర్‌ నిర్మాణానికి ప్రణాళిక… రూ. 35 కోట్లతో నూతన భవన నిర్మాణం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో సుప్రసిద్ధ ఈఎన్‌ టీ ఆసుపత్రి ప్రాచీన భవనానికి మరమ్మత్తులు చేసి రక్షిత కట్టడంగా కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. ఆసుపత్రి ముందున్న సుమారు ఎకరం స్థలంలో ఆధినిక ఆధునిక వైద్య సదుపాయాలతో నూతన భవనం నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించడంతో పాటుగా సుమారు 40 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నూతన భవనం నిర్మాణం అనంతరం పాతభవనాన్ని జీహెచ్‌ ఎంసీ కి అప్పగించనున్నారు. అనంతరం ఈ భవానికి మరమ్మత్తులు చేసి రక్షిత కట్టడంగా ప్రభుత్వం కాపాడనుంది.

కొత్తగా నిర్మించే భవనంలో ఈఎన్‌ టీ చికిత్సకోసం ప్రపంచంలోని ఆధునిక యంత్రాలను, ఆపరేషన్‌ థియోటర్లను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే డాక్టర్ల బృదం అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రూ. 7 కోట్లతో మాడ్యువల్‌ ఆపరేషన్‌ థియోటర్లను నిర్మించేందుకు డీపీఆర్‌ సిద్ధం చేశారు. ప్రస్తుతం అంచనావ్యయం రూ. 40 కోట్లు ఉన్నప్పటికీ రూ.35 కోట్ల కు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా పరమైన అనుమతులు ఇవ్వడంతో పాటుగా ఆపరేషన్‌ థియోటర్ల నిర్మాణానికి ఆంగీకారం తెలిపింది.

రాబోయో మార్చి లో పనులు ప్రారంభించి ఏడాదిలోగా పూర్తి చేయాలనే పట్టుదలతో వైద్య ఆరోగ్య శాఖ ఉంది. ప్రస్తుతం వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రి భవనం ఏడవ నిజాం కాలంలో ఇండో పర్షియన్‌ వాస్తురీతుల్లో నిర్మించారు. 1955లో నిజాం హైదరాబాద్‌ రాష్ట్ర రాజ్య ప్రముఖ్‌ హోదాలో ఈ ఆసుపత్రిని ప్రారంభించారు. అప్పటికే ఈ భవనం నిర్మించి 20 సంవత్సరాలు గడిచాయని పురావస్తు నిపుణులు అంచనా వేశారు. నిజాం పాలనలో పార్సీ వ్యాపార వేత్తలు పెస్టోంజీ, విక్కాజీ మెహర్జీ వినాసం గా ఈ భవనం గా ఉండేది.

స్వాతంత్య్రానంతరం వ్యాపారవేత్తలు సొంత దేశానికి వెళ్లగా ప్రభుత్వం ఈ భవనాన్ని స్వాధీనం చేసుకుని చెవి,ముక్కు, గొంతు ఆసుపత్రి ఏర్పాటు చేసింది.ఈ నేపథ్యంలో గత సంవత్సరం ఈ భవనం నుంచి ఆసుపత్రిని తరలించాలని జీహెచ్‌ ఎంసీ సెక్షన్‌ 459 మేరకు నోటీసులు ఇవ్వగా మొదటి అంతస్తును కాళీ చేసి కింది అంతస్తుతో పాటుగా ఆసుపత్రి పరిసరాల్లోని స్థలాల్లో వైద్యపరీక్షల విభాగాలను ఏర్పాటు చేసి చేవలందిస్తున్నారు. రోజుకు సుమారు 2 వేల ఓపి రోగులు రాగా సగటున 30 నుంచి 40 ఆపరేషన్లు జరగుతున్నాయి.

- Advertisement -

ఆసుపత్రికి రోగుల తాకిడి అధికంగా ఉన్నప్పటికీ వైద్యసేవల్లో ఎలాంటి జాప్యం లేకుండా అందిస్తున్నట్లు ఆసుపత్రి సూపరిండెంట్‌ డాక్టర్‌ శంకర్‌ చెప్పారు. నవజాత శిశువుల నుంచి అన్ని వయస్సుల వారికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. మూడు సంవత్సరాల లోపు పిల్లలకు వినికిడి సమస్య ఉంటే శస్త్ర చికిత్స చేసి ప్రత్యేక పరికరాన్ని అమర్చి సమస్యను పరిష్కరించడం ఈ ఆసుపత్రి ప్రత్యేకమన్నారు.

ఈ ఆపరేషన్‌ కు సుమారు రూ. 6లక్షల 50వేలు ఖర్చు కాగా పూర్తిగా ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. కరోనా అనంతరం బ్లాక్‌ ఫంగస్‌ కేసులు అత్యధికగా వస్తున్నాయని తెలిపారు. కరోనా సమయంలో ప్రత్యేక చికిత్స అందించి అనేకమందిని కాపాడిన చరిత్ర ఆసుపత్రికి ఉందన్నారు. ప్రధానంగా క్యాన్షర్‌, ఎలర్జీ, బ్లాక్‌ ఫంగస్‌ కేసులు అత్యధికంగా వస్తున్నాయని ప్రొఫెసర్‌ రవిశంకర్‌ చెప్పారు. ఆసుపత్రి ముందున్న స్థలంలో అత్యాధునికంగా ఆసుపత్రిని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయన్నారు. పరీక్షల నుంచి చిక్సిత్స వరకు ఆసుపత్రిలో సేవలందుబాటులో ఉన్నాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement