ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో చేరుతారనే నమ్మకం తనకు లేదని ఆ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. అయితే ఆయన కాంగ్రెస్‌లో చేరడం పట్ల పార్టీలో ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ క్షీణత, పార్టీ పునరుద్ధరణ కోసం పీకే ఇచ్చిన విశ్లేషణ ఆకట్టుకునేలా ఉందని చెప్పారు. పీకే లెక్కల వ్యక్తి అని, అందులో కొత్తదేమీ లేదని, తమకూ ఆ లెక్కలు తెలుసు అన్నారు. అతని సూచనలకు ఎలాంటి ప్రతిఘటనా లేదని చెప్పుకొచ్చారు. ఎవరైనా ఏ సమస్య అయినా ప్రస్తావిస్తే.. ఆ సమస్యను పార్టీ ఎలా ఎంచుకుంటుందనేది ఒక్కటే ప్రశ్నగా చెప్పుకొచ్చారు. పీకేతో తనకు చాలా సన్నిహిత సంబంధాలున్నాయని, రాజకీయ విశ్లేషకుడు అని, అతడి ప్రయాణం ఓ పార్టీ నుంచి మరో పార్టీలోకి సాగిందన్నారు.
ఆయనకు ఎలాంటి రాజకీయ నిబద్ధతా లేదా సైద్ధాంతిక నిబద్ధతా లేదన్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఆయన చాలా కచ్చితమైన ప్రణాళికలతో ముందుకు వచ్చినట్టు వివరించారు. కాంగ్రెస్ పార్టీకి మంచి చేయాలన్న ఆలోచనలో పీకే ఉన్నారని, అయితే ఆయన చేరికపైనే కొంత మందిలో అనుమానాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. పార్టీలో పీకే ఎంట్రీపై ఎవరూ విభేదించడం లేదని, అందరూ రావాలనే కోరుకుంటున్నారని దిగ్విజయ్ తెలిపారు. పార్టీకి ఇచ్చిన రోడ్‌మ్యాప్ ఎంతో బాగుందని, ప్రదర్శనతీరు కూడా ఎంతో ఆకట్టుకుందని చెప్పుకొచ్చారు.