కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే రెండేళ్లలోపు మరణిస్తారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. సాక్షాత్తూ నోబెల్ ప్రైజ్ విజేత, ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ వైరాలజిస్ట్ లూసీ మాంటగనీర్ ఈ విషయాన్ని చెప్పాడంటూ కొందరు వివిధ రూపాల్లో సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారిని కాపాడేందుకు మందుకు కూడా దొరకదని, వారి అంత్యక్రియలు చేసేందుకు సిద్ధం కావడమే తప్ప మరో మార్గం లేదని లూసీ మాంటగనీర్ చెప్పినట్టుగా ఈ పోస్టులు వైరల్‌గా మారాయి. అయితే ఈ ప్రచారాన్ని భారత ప్రభుత్వం ఖండించింది.
కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే రెండేళ్లలో మరణిస్తారంటూ వస్తున్న వదంతులు పూర్తిగా అవాస్తవాలేనంటూ కేంద్రం స్పష్టం చేసింది. అలాంటి సమాచారాన్ని నమ్మవద్దని సూచించింది. కరోనా వైరస్ నివారణకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అని తేల్చి చెప్పింది. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు పూర్తిగా సురక్షితం అని..ఎవరూ దుష్ప్రచారాలను నమ్మవద్దని తెలిపింది. అలాగే తమ వద్దకు అలాంటి సమాచారం ఏదైనా వచ్చినా దాన్ని ఇతరులకు పంపవద్దని విజ్ఞప్తి చేసింది.