ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్-2022లో భారత రెజర్ల స్థాయికి తగినట్లు ప్రదర్శన చేయలేక పోతున్నారు. పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తున్నారు. ఇప్పటికే రెజ్లర్లు సోనమ్ మాలిక్, సుష్మా షోకీన్ ఇంటిముఖం పట్టగా, తాజాగా మరొక భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ కూడా టోర్నీ నుంచి తొలిరౌండ్‌లోనే నిష్క్రమించింది. మంగళవారం జరిగిన మహిళల 53 కేజీల విభాగం తొలి రౌండ్‌లోనే ఫోగట్ ఓటమి పాలైంది. మంగోలియాకు చెందిన రెజ్లర్ ఖులాన్ బత్‌ఖుయాగ్ చేతిలో 0-7 తేడాతో పరాజయం పొందింది. కామన్వెల్త్‌లో స్వర్ణం సాధించిన 10వ సీడ్ రెజ్లర్ వినేష్ చివరి క్షణాల్లో బ్యాలెన్స్‌కోల్పోయింది. యాదృచ్చికమేమిటంటే.. సెలక్షన్ ట్రయల్స్‌లో వినేష్ చేతిలో డగౌట్ అయిన భారత జూనియర్ రెజ్లర్ యాంటిమ్, గతనెల ప్రారంభంలో జరిగిన అండర్ -23 ఆసియా మీట్‌లో బత్‌ఖుయాగ్‌ను చిత్తుచేసింది.
అన్షుమాలిక్ గైర్హాజరీ, జపనీస్‌సంచలనం అకార్ పుజినామి పుల్ అవుట్ నేపథ్యంలో వినేష్ ఫొగాట్‌కు అనుకూలమైన డ్రా లభించింది. కానీ దురదృష్టవశాత్తు క్వాలిఫికేషన్స్‌లో ఆమె బోల్తాపడింది. ఇక 50 కేజీల విభాగంలో రొమేనియా రెజ్లర్ అలీనా వూక్‌చేతిలో నీలమ్ సిరోహి 0-10 తేడాతో ఓటమి చెందడం భారత్‌కు మరింత నిరాశ కలిగించింది. 65 కేజీల విభాగంలో షఫాలీ, 76 కేజీల విభాగంలో ప్రియాంక మొదటి రౌండ్‌ను దాటలేక పోయారు.