ఇంటర్ కాంటినెంటల్ ఫుట్‌బాల్ కప్ గెలిచిన భారత ఫుట్‌బాల్ టీమ్ తన ఉదారతను చాటుకుంది. ఇటీవల ఒడిశాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు రూ.20 లక్షల విరాళాన్ని ప్రకటించింది. ఇంటర్ కాంటినెంటల్ ఫుట్‌బాల్ కప్‌ను కైవసం చేసుకున్న భారత జట్టుకు ఒడిశా ప్రభుత్వం రూ.కోటి బహుమతిగా ప్రకటించింది.
అయితే.. ఇదే రాష్ట్రంలో ఇటీవల ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుని 280 మందికిపైగా మృతిచెందగా.. భారీసంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డ విషయం తెలిసిందే. దీంతో తమకు ప్రకటించిన బహుమతి నుంచి రూ.20 లక్షలను రైలు ప్రమాద బాధిత కుటుంబాలకు ఇవ్వాలని ఫుట్‌బాల్ జట్టు నిర్ణయించింది.
‘మా జట్టు గెలిచినందుకు నగదు బ#హుమతి ప్రకటించిన ఒడిశా ప్రభుత్వానికి కృతజ్ఞతలు. అయితే.. ఇదే సమయంలో మేం అందులోంచి రూ.20 లక్షలను రైల్వే ప్రమాద బాధితులకు అందించాలనుకుంటున్నాం. డ్రెస్సింగ్ రూమ్ నుంచి తీసుకున్న సమష్టి నిర్ణయం ఇది’ అని భారత ఫుట్‌బాల్ జట్టు ట్వీట్ చేసింది.