తుగ్గలి, సెప్టెంబర్ 11 (ప్రభ న్యూస్) : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న డాక్టర్లకు ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నెంబర్ 85 తీవ్ర నష్టం కలిగిస్తుంది. దీంతో ఇప్పటికే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న డాక్టర్లు సమ్మెబాటిలోకి వెళ్లారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 2 సంవత్సరాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 3 సంవత్సరాలు, అర్బన్ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 5 సంవత్సరాలు పనిచేస్తున్న ప్రభుత్వ డాక్టర్లకు ఇన్ సర్వీస్ ఉద్యోగం కింద 30శాతం పీజీ కోర్సుల్లో ప్రవేశం పొంది ఉన్నత విద్యలు అభ్యసించేవారు.
అలాగే వారికి ఇష్టమైన 14స్పెషలిస్ట్ కోర్సుల్లో పీజీ ఉన్నత విద్యను అభ్యసించేవారు. అయితే ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో 85 వల్ల గతంలో 30శాతం పీజీ సీట్లు పొందే డాక్టర్లు ఇక నుండి కేవలం 15శాతం మాత్రమే పీజీలో సీట్లు పొందవలసి ఉంటుంది. అంతేకాక గతంలో 14 స్పెషలిస్ట్ కోర్సుల్లో పీజీ కోర్సు చేసేవారు. అయితే ప్రస్తుతం కేవలం 6 స్పెషలిస్ట్ కోర్సుల్లో మాత్రమే పీజీ కోర్సు చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న డాక్టర్లు 15శాతం పీజీలో సీట్లు కోల్పోవడమే కాక 8 స్పెషలిస్ట్ కోర్సుల్లో కూడా ఉన్నత విద్యను అభ్యసించలేక పోతున్నారు.
అయితే ఎప్పటికైనా తాము ఉన్నత విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో డాక్టర్లు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తూ పేదలకు వైద్యం అందిస్తూ ఉన్నారు. అంతేకాక కరోనా సమయంలో కూడా తమ ప్రాణాలకు తెగించి ప్రజలకు వైద్యం అందించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న డాక్టర్లు స్పెషలిస్ట్ కోర్సులు పూర్తయిన తర్వాత తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రులలోనే విధులు నిర్వహిస్తామని ప్రభుత్వానికి ఒప్పందం పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది.
దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న డాక్టర్లు ఉన్నత విద్య పూర్తయితే అలాంటి డాక్టర్లు ఏరియా, జనరల్ ఆసుపత్రులలో వైద్యం అందిస్తారు. ఆ సమయంలో పేద ప్రజలకు కూడా వైద్యం అందుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన జీవో 85వల్ల పి హెచ్ సి డాక్టర్లు ఉన్నత విద్యను కోల్పోతూ తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. అందువల్ల ప్రభుత్వం పునః ఆలోచించి జీవో నెంబర్ 85ను రద్దు చేయాలని పీ హెచ్ సి డాక్టర్లు కోరుతున్నారు.