హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అతిపెద్ద ఫార్మాసుటికల్ కంపెనీల పార్కు ఫార్మాసిటీ అభివృద్ధి పూర్తి చేయడంలో ప్రభుత్వానికి వరుస ఆటంకాల ఎదురవుతున్నాయి. ఓ పక్క ఫార్మాసిటీకి భారీగా అవసరమైన భూముల సేకరణ ప్రభుత్వానికి సవాల్‌గా మారగా మరోపక్క ఇప్పటికే సేకరించిన భూముల్లో అభివృద్ధి పనులను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్(పీపీపీ) తరహాలో చేపట్టడానికి కాంట్రాక్టు కంపెనీలు ముందుకు రావడం లేదు. హైదరాబాద్ నగర శివార్లలోని రంగారెడ్డి జిల్లాలో 20 వేల ఎకరాల్లో ఆసియాలోనే అతిపెద్ద ఫార్మాసుటికల్ కంపెనీల పార్కు ఏర్పాటుకు నిర్ణయించిన ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా చర్యలు ప్రారంభించింది. రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు మండలాల్లోని పలు గ్రామాల్లో ప్రభుత్వం ఇప్పటికే కొన్ని వేల ఎకరాలు సేకరించి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించింది. అయితే రెండవ దశ భూ సేకవరణలో ప్రభుత్వానికి అడ్డంకులు ఎదురవుతన్నాయి. పలు గ్రామాల్లో రైతులు తమ భూములను ఇవ్వడానికి అభ్యంతరాలు చెబుతున్నారు. దీంతో ఫార్మాసిటీకి అవసరమైన భూముల సేకరణనత్త నడకన సాగుతోంది. ఇటీవల రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో నిర్వహించిన ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలోనూ ఇదే విషయమై మంత్రి స్పష్టత ఇచ్చారు. భూ సేకరణ సమస్యల వల్లే ఫార్మాసిటీ ప్రారంభం మరింత ఆలస్యమవుతోందని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.
పీపీపీ పద్ధతిలో అభివృద్ధి పనులకు వెనుకడుగు వేస్తున్న కాంట్రాక్టు కంపెనీలు…
భూ సేకరణ సమస్యతో పాటు ఫార్మాసిటీ అభివృద్ధి పనులకు కాంట్రాక్టు ఏజెన్సీలు ముందుకు రావడం తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(టీఎస్‌ఐఐసీ)కు సవాల్‌గా మారినట్లు తెలుస్తోంది. ఫార్మాసిటీలో ఏర్పాటు చేయబోయే కంపెనీల నుంచి వెలువడే పారిశ్రామిక వ్యర్థాలను శుద్ధి చేసే జీరో లిక్విడ్ డిశ్చార్జ్ భారీ కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్(సీఈపీటీ)ని పీపీపీ పద్ధతిలో నిర్మించడానికిగాను కాంట్రాక్టు కంపెనీల నుంచి టెండర్లు గతేడాది టెండర్లు పిలిచింది. అప్పటి నుంచి సంవత్సర కాలం గడుస్తున్నా సీఈపీటీ నిర్మాణానికి కంపెనీలు ముందుకు రాకపోవడంతో టీఎస్‌ఐఐసీ బిడ్‌ల దాఖలుకు ఆఖరు తేదీని పొడిగిస్తూ వస్తోంది. ఇలా ఇప్పటికి ఏడాది నుంచి 14సార్లు గడువు పొడిగించింది. తాజాగా సెప్టెంబరు మొదటి వారానికి మళ్లి పొడిగిస్తూ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్‌ను సవరిస్తూ ప్రకటన జారీ చేసింది. దీంతో ఫార్మాసిటీ అభివృద్ధికి అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.