దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగుతోంది. ఈ నెల 22 నుంచి మొదలైన పెట్రోధరల బాదుడు శనివారం కూడా కొనసాగింది. మధ్యలో ఒకరోజు విరామం ఇచ్చిన ఆయిల్ కంపెనీలు ఆ తర్వాత ప్రతిరోజూ ధరలు పెంచుతున్నాయి. మార్చి 22న 80పైసలు చొప్పున లీటర్ పెట్రోల్, లీటర్ డీజిల్‌పై పెరిగింది. తాజాగా శనివారం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) తెలిపిన సమాచారం ప్రకారం పెట్రోల్ 70పైసలు, డీజిల్‌పై 80పైసలు పెరిగింది. గత ఐదు రోజుల్లో పెట్రోధరలు పెరగడం ఇది నాలుగోసారి. 137రోజులపాటు స్థిరంగా కొనసాగిన పెట్రోల్, డీజిల్ ధరలు మార్చి 22 తర్వాత పరుగుందుకున్నాయి. శనివారం దేశ రాజధాని ఢిల్లిలో లీటర్ పెట్రోల్ ధర 98.61కు చేరుకోగా, డీజిల్ రూ.89.97కు చేరింది. ముంబైలో 84పైసలు పెరిగిన లీటర్ పెట్రోల్ ధర 113.35కు చేరింది. చెన్నైలో 76పైసలు పెరిగి 104.43, కోల్‌కతాలో 108.01కు చేరింది.
గత ఐదు రోజుల వ్యవధిలో పెట్రోధరలు రూ.3.10 పెరిగాయి. కాగా హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.80కు చేరుకోగా లీటరు డీజిల్‌ధర రూ.98.10కు చేరింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినా భారత్‌లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు కారణంగా పెట్రోధరలు పెరగలేదు. దీంతో ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ రూ.19వేల కోట్లు నష్టపోయాయని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ తెలిపింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం కారణంగానే ఇంధన ధరలు పెరుగుతున్నాయని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి...