Saturday, November 23, 2024

Big Story: పెట్రో మోత.. సర్వీస్‌, కన్జ్యూమర్‌ బంకుల రేట్లలో భారీ తేడా

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఎన్నికల తరువాత పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతాయన్న దానికి ప్రస్తుతం రాష్ట్రంలో పలు బంకుల్లో అమలవుతున్న ధరల అస్థిరీకరణ నిదర్శనంగా నిలుస్తోంది. తెలంగాణలో రైతుల మేలు కోసం ప్రభుత్వం ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా కూడా పెట్రోల్‌ బంకులను మంజూరు చేసింది. ఇదే సమయంలో ఆయా కంపెనీలు డీలర్ల ద్వారా పెట్రోల్‌ బంకులను నడుపుతోంది. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సర్వీస్‌ పెట్రోల్‌ బంకులు, కన్జ్యూమర్‌ పెట్రోల్‌ బంకులు నడుస్తున్నాయి. అయితే వీటి నిబంధనల ప్రకారం సర్వీస్‌ పెట్రోల్‌ బంకుల కంటే కన్జ్యూమర్‌ బంకుల్లో ధరలు తక్కువగా ఉండాలి. కానీ దీనికి విరుద్ధంగా కేంద్రం రోజురోజుకు ధరల్లో మార్పులు చేస్తూ సర్వీస్‌ బంకులకంటే కన్జ్యూమర్‌ బంకుల్లో ధరలను పెంచుతోంది. దీంతో పీఏసీఎస్‌ల బంకులకు వ్యాపారం తగ్గడంతో బంకులు మూతపడుతున్నాయి.

నష్టపోతున్న కన్జ్యూమర్‌ బంకులు..

ఇంధన ధరలలో రెండు మూడు నెలలుగా జరుగుతున్న మార్పులతో పీఏసీఎస్‌ల ద్వారా ఏర్పాటుచేసిన కన్జ్యూమర్‌ బంకులు నష్టాల్లోకి వెళ్లడంతో పాటు మూసివేయాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వాస్తవానికి సర్వీస్‌ బంకుల కంటే కన్జ్యూమర్‌ బంకుల్లో రూ.3 నుంచి రూ.5 వరకు ధరలు తక్కువగా ఉంటాయి. కానీ ధరల మార్పుతో సర్వీస్‌ బంకుల్లో రేట్లు పెరగకపోగా, కన్జ్యూమర్‌ బంకుల్లో మాత్రం ధరలు పెరుగుతున్నాయి. దీంతో తక్కువ ధర ఉండాల్సిన పీఏసీఎస్‌ల బంకుల్లో ధరలు పెరుగుతున్నాయి. ఇందుకు ఉదాహరణ.. భువనగిరి జిల్లాలోని సర్వీస్‌ బంకుల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.108.25 ఉండగా, డీజెల్‌ ధర రూ.94.74గా ఉంది. ఇదే జిల్లాలోని కన్జ్యూమర్‌ బంకుల్లో తక్కువ ఉండాల్సిన ధరలు మాత్రం పెరుగుతూ.. ప్రస్తుతం పెట్రోల్‌ ధర రూ.112.03 ఉండగా, డీజెల్‌ ధర రూ.101.97గా ఉంది. అంటే సర్వీస్‌ బంకులతో పోల్చితే కన్జ్యూమర్‌ బంకుల్లో పెట్రోల్‌ ధర రూ.3.63ఎక్కువ ఉండగా, డీజెల్‌ ధర ఏకంగా రూ.7.23ఎక్కువగా ఉండడం గమనార్హం. సర్వీస్‌ బంకుల కంటే కన్జ్యూమర్‌ బంకుల్లో తక్కువ ఉండాల్సిన ధరలను ప్రభుత్వం అధిక ధరలకు అందించడంతో పీఏసీఎస్‌ బంకులకు నిర్వహణ భారంగా మారింది. దీంతో బంకులను మూసివేయాల్సిన పరిస్థితి వచ్చిందని మోత్కూరు బంక్‌ నిర్వాహకులు కంచర్ల అశోక్‌ రెడ్డి ఆంధ్రప్రభతో అన్నారు.

అసలు కన్జ్యూమర్‌ బంకులేంటంటే..?

ప్రాధమిక వ్యవసాయ సహాకార పరపతి సంఘాల (ఫ్యాక్స్‌)కు తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్‌ బంకులను మంజూరు చేసింది. ఫ్యాక్స్‌ ద్వారా నిర్వహింపబడుతున్న బంకులను కన్జ్యూమర్‌ బంకులు అంటారు. ఈ బంకులకు కంపెనీలు ప్రైవేటుగా నడుపుకునే డీలర్ల (సర్వీస్‌) బంకులకంటే తక్కువ ధరలకు ఆయిల్‌ను అందించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కన్జ్యూమర్‌ బంకులకు కేంద్రం ధరలను పెంచింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 100కు పైగా కన్జ్యూమర్‌ బంకులు ఉన్నాయి. వీటిలో కరీంనగర్‌, మెదక్‌లలో ఎక్కువ ఉండగా, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, ఖమ్మంతో పాటు మరికొన్ని జిల్లాల్లోనూ ఈ బంకులున్నాయి.

- Advertisement -

రైతులపై భారం..మూత పడుతున్న కస్టమర్‌ బంకులు..

ఫ్యాక్స్‌ బంకుల్లో ధరలు పెరుగుతుండడంతో రైతులకు భారంగా మారుతోంది. దీంతో సర్వీస్‌ బంకుల్లో ధరలు తక్కువగా ఉండడంతో రైతులు ఈ బంకులకు వెళ్తున్నారు. బంకులకు రైతులు రాకపోవడంతో వ్యాపారం తగ్గి నిర్వహాణ భారంగా మారుతుంది. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని అడ్డగూడూరు మండలం, శిర్రగూడురు గ్రామపరిధిలోని కన్జ్యూమర్‌ బంకును నిర్వాహకులు మూసివేశారు. కాగా వీటితో పాటు రాష్ట్రంలోని మిగతా కస్టమర్‌ బంకులూ మూతపడుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ భారం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది రైతులపై పడనున్నట్టు అంచనా.

ఒకవైపు ఎరువు దరువు.. మరో వైపు ఇంధన మంట..

ఇప్పటికే దేశ రైతాంగంపై కేంద్రం ఎరువు ధరల దరువేస్తుండగా, మరోవైపు కన్జ్యూమర్‌ బంకుల్లో ధరలను పెంచడంతో రైతులకు భారంగా మారుతోంది. పెరిగిన ఎరువుల ధరలతోనే నష్టపోతున్న రైతాంగంపై పెట్రోల్‌ ధరల సాక్షిగా అన్నదాతలను కేంద్రం కోలుకోలేని దెబ్బ తీస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement