Saturday, November 23, 2024

యుద్ధంవల్లే పెట్రోభారం, తప్పనిసరై ధరలు పెంచాల్సి వస్తోంది: ఆర్థికమంత్రి నిర్మల

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధ ప్రభావంవల్ల తప్పనిసరి పరిస్థితుల్లో విధిలేక పెట్రో ధరలు పెంచాల్సి వస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ స్పష్టం చేశారు. ప్రజలపై రోజురోజుకూ కేంద్ర ప్రభుత్వం పన్నుల భారం పెంచుతోందన్న విపక్షాల విమర్శలను ఆమె తిప్పికొట్టారు. ధరల పెంపు నిర్ణయాన్ని సమర్థించుకుంటూ కొరియా యుద్ధం నేపథ్యంలో స్వర్గీయ జవహర్‌లాల్‌ ప్రధానిగా తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌పై ఎదురుదాడికి దిగారు. ఫైనాన్స్‌ బిల్లు -2022పై లోక్‌సభలో శనివారం చర్చ జరిగిన సందర్భంలో నిర్మల కీలక వ్యాఖ్యలు చేశారు. 1950లో కొరియా యుద్ధం నేపథ్యంలో దేశంలో ధరలు పెరిగిన అంశాన్ని ఉటంకిస్తూ అప్పటి ప్రధాని నెహ్రూ చేసిన వాదనల సారాంశాన్ని నిర్మల లోక్‌సభలో హిందీలో చదివి వినిపించారు. ఆ యుద్ధంవల్లే భారత్‌లో ద్రవ్యోల్బణ పరిస్థితులు నెలకొన్నాయని, ధరలు పెరిగాయని అప్పట్లో నెహ్రూ లోక్‌సభలో వెల్లడించారు. ఇదే విషయాన్ని నిర్మల ప్రస్తావిస్తూ ప్రపంచంతో పెద్దగా సంబంధాలు, ప్రభావం లేని ఆ సమయంలో, కొరియా యుద్ధంవల్లే ధరలు పెరిగాయన్న నెహ్రూ వాదనలో నిజం ఉన్నట్టయితే, ప్రపంచ దేశాల్లో ఎంతో పరపతి, వ్యాపార సంబంధాలు బలపడిన ప్రస్తుత భారత్‌లో ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంవల్ల పెట్రో ధరలు పెరగడం సమంజసమేనని సమర్థించుకున్నారు. ఇది ఒక్క భారత్‌లోనే కాదని, ప్రపంచ దేశాలన్నింటిపైనా ప్రభావం చూపుతోందని అన్నారు. అలాగే, 1970లో ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో ఆదాయపన్ను పరిమితిని 93.5 శాతం మేర పెంచారంటూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. అయినా పెట్రో ధరల పెంపు వ్యవహారంతో ప్రభుత్వానికి ప్రత్యక్ష సంబంధం లేదని, అది చమురు సంస్థలు, ప్రపంచ చమురు మార్కెట్‌లో పరిస్థితులను బట్టి నిర్ణయిస్తాయని చెప్పుకొచ్చారు. గడచిన నాలుగు నెలల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉండగా గడచిన వారంలో భారీగా పెరిగాయి. ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోందన్న ఆమె జీఎస్‌టీ పరిహారంపై రాజకీయాలు మానుకోవాలని విపక్షాలకు సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement