Tuesday, November 26, 2024

మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ల ఏర్పాటు.. హైకోర్టులో పిటిషన్!

రాజధాని అమరావతి పరిధిలోకి వచ్చే మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలను కలిపి ఒకే కార్పొరేషన్‌గా మారుస్తూ ఇటీవల ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్ల ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. గత నెలలో ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.19ని రద్దు చేయాలని ఉండవల్లి రైతు సాంబశివరావు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్‌ తరపున రిట్‌ పిటిషన్‌ ను హైకోర్టు న్యాయవాది రవిశంకర్‌ దాఖలు చేశారు. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తూ..ఇచ్చిన జీవో అక్రమం, నిబంధనలకు విరుద్ధమని పిటిషన్‌ లో పేర్కొన్నారు. ఆర్టికల్‌ 14, 19, 21, 243Q, 300A ప్రకారం ఈ ఉత్తర్వులు చట్ట విరుద్ధమని పిటిషన్‌ లో తెలిపారు. అయితే, ఈ పిటిషన్ ను సెలవుల తర్వాత విచారణ చేపడతామని జస్టిస్‌ మానవేంద్రరాయ్‌ తెలిపారు. విచారణ నాటికి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. 

మున్సిపల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన కొద్ది రోజుల్లోనే జగన్ సర్కారు అనూహ్యంగా.. రాజధాని అమరావతి పరిధిలోకి వచ్చే మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలను కలిపి ఒకే కార్పొరేషన్‌గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు మున్సిపాలిటీలను కలిపి మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌ గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మంగళగిరి మున్సిపాలిటీతోపాటు.. దాని పరిధిలోని 11 గ్రామ పంచాయతీలు.. తాడేపల్లి మున్సిపాలిటీతోపాటు దాని పరిధిలోని మరో 10 గ్రామ పంచాయతీలను మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొచ్చారు. మున్సిపల్ యాక్ట్-1994 ప్రకారం ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

మూడు రాజధానుల ఏర్పాటు దిశగా వైసీపీ ప్రభుత్వం అడుగులేస్తున్నప్పటికీ.. అమరావతి ప్రాంతానికి చెందిన ప్రజలు పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకే పట్టం కట్టారు. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలను ప్రత్యేకంగా చూస్తున్నారు. సీఎం జగన్ క్యాంపు ఆఫీసు ఉన్న తాడేపల్లితోపాటు మంగళగిరిలను మోడల్ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దుతామని వైసీపీ సర్కారు గతంలో హామీ ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement