జంతువులతో మనిషికి ఉన్న బంధం ఈ నాటిది కాదు. శతాబ్ధాల కాలం నాటిది. ఇంకా చెప్పాలంటే ఆది మానవుడి నాటిది. కొందరు పాడికోసం.. ఇంకొందరు వ్యాపారం కోసం, మరికొందరు రక్షణ కోసం, సంతోషం కోసం జంతువులను పెంచుకుంటారు. ఇందులో భాగంగా వాటితో సన్నిహితంగా మెలుగుతుంటారు. అయితే ఆయా జంతువుల వల్ల వచ్చే భయంకరమైన వ్యాధుల గురించి మాత్రం చాలామందికి తెలియదంటే అతిశయోక్తి కాదు. ప్రతీ జంతువు నుంచి మనుషులకు బోలెడన్ని వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. జంతువుల నుంచి వచ్చే వ్యాధులపై ‘ఆంధప్రభ’ కథనం..
గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ప్రతి ఇంట్లోనూ కుక్కలు, పశువులు, కోళ్లను పెంచుతుంటారు. వాటితో పాటుగా కొన్ని కుటుంబాల వారు పందులను కూడా పెంచుతుంటారు. ఇక ఏ ఇంట్లో అయినా ఎలుకలు ఉండడం సహజం. ఈ విధమైన జంతువుల నుంచి వచ్చే రోగాలను జునోసిస్ వ్యాధులు అంటారు. లూయిస్‌పాశ్చర్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటగా రేబీస్ వ్యాధికి టీకాను తయారుచేసి పిచ్చికుక్క కరిచిన తొమ్మిదేళ్ల బాలుడిపై 1885 జూలై 6వ తేదీన ప్రయోగించి విజయం సాధించారు. ఆ బాలుడు బతకడంతో ఆ రోజును ప్రతియేడు జునోసిస్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
వైరస్ ద్వారా వచ్చే వ్యాధులు..
మనుషులకు జంతువుల నుంచి వచ్చే వ్యాధులు 150కి పైగానే ఉన్నాయి. ఇందులో వైరస్ ద్వారా సంక్రమించేవి అధికం. ముఖ్యంగా ఈ వ్యాధులు గాలి, కలుషితమైన నీరు, ఆహారం, మాంసం, పాల ద్వారా వ్యాపిస్తాయి. వైరస్, బాక్టీరియా, పరాన్న జీవుల ద్వారా వివిధ రకాలుగా జునోసిస్ వ్యాధులు వ్యాపించి మనుషులకు ప్రాణనష్టం కలిగిస్తాయి. వైరస్ ద్వారా సంక్రమించే ప్రాణాంతకమైన వ్యాధుల్లో రేబీస్ ప్రధానమైనది. పిచ్చికుక్క, కాటువల్ల సోకే ఈ వ్యాధి ద్వారా మన దేశంలో యేటా 30 నుంచి 40వేల మంది మృత్యువాత పడుతున్నారు. వైరస్ ద్వారా వ్యాపించే మరొక ప్రాణాంతకమైన వ్యాధి పిచ్చి ఆవు వ్యాధి (మ్యాడ్ కౌ). ఈ వ్యాధి కారణంగా ఇంగ్లాండులో అధిక ప్రాణనష్టం జరుగుతోంది. ప్రతీ ఏడాది అమెరికాలో సుమారు నాలుగు మిలియన్ల మందికి పెంపుడు జంతువుల ద్వారా వ్యాధులు సోకుతున్నాయి. జపనీస్ ఎన్‌సెపలైటీస్(మెదడు వాపు వ్యాధి) కూడా పందుల శరీరంపై కుట్టిన దోమ తిరిగి వేరొకరిని కుట్టడం వల్ల ఈ వ్యాధి సోకుతుంది. దీనిద్వారా ఎంతో మంది చిన్నారులు మరణిస్తున్నారు. ఎబోలా వైరస్ అనేది గబ్బిలాలు, కోతులు, గోరిల్లా చింపాజీల ద్వారా సోకుతుంది. కోళ్లద్వారా బర్డ్ ఫ్లూ వ్యాధి సంక్రమిస్తుంది.
బ్యాక్టీరియాతో సంక్రమించేవి..
బుకసెల్లా : కలుషితమైన పాలు, మాంసం ద్వారా వ్యాధి వస్తుంది. మేకల ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. టీబీ(క్షయ) : ఈ వ్యాధి పందులు, తోడేలు, ఎలుకలు, కలుషితమైన మాంసం ద్వారా సంక్రమిస్తుంది. లెప్టోస్పైలోసిస్ : కుక్కలు, ఎలుకలు, నల్లుల ద్వారా ఈ వ్యాధి మనుషులకు వ్యాపిస్తుంది. పరాన్నజీవుల ద్వారా వచ్చేవి : ఆంపైలోస్టోయే యాసిస్, మైడాటేయాసిస్, అలర్జీ, గజ్జి, అంబీడీయా, టాక్సీసీస్ వంటి వ్యాధులు జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తాయి. డెయిరీఫాంతో పనిచేసే వారికి పశువుల నుంచి బూసెల్లా వ్యాధి వస్తుంది. ఆఫ్రికాలో ఎబోలా వైరస్‌తో మరణాలు సంభవిస్తున్నాయి.
పలు జంతువులు-వచ్చే వ్యాధులు..
మేకలు : రింగ్‌వార్మ్, లిస్టిరయేసిస్
గుర్రాలు : గ్లాండర్స్ మెదడువాపు,
అస్పంల్లోసిస్, క్షయ, బ్రికోల్లా
పందులు : క్షయ, శ్వాసకోశ వ్యాధులు, రేబీస్
కుక్కలు : రేబీస్, బుసెల్లా, ప్లాజీ
ఎలుకలు : ప్లాజీ, లెస్టోస్ప్రేరోసిస్, మెదడువాపు
కోతులు : రేబీస్, దోమ, మిసిసల్స్
కుందేలు : తులసీమియా, టుటాక్యోప్లాసీమెను
పక్షులు : సిట్టకోకోసిస్, సాల్మోసెల్లోసిస్, అస్పంల్లోసు
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.