Saturday, November 23, 2024

ఏపీలో 1.9 లక్షల మంది వీధి వర్తకులకు స్వనిధి రుణాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ‘ప్రధానమంత్రి స్వనిధి’ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 1,90,433 మంది వీధి వర్తకులకు రుణాలు మంజూరు చేసినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ 2020-21 ఆర్థిక సంవత్సరంలో 1,12,744 మందికి, 2021-22 లో 70,415 మందికి, 2022-23 లో 7,274 మందికి మొదటి దశ కింద ఒక్కొక్కరికి రూ. 10 వేల రుణం మంజూరు చేసినట్లు తెలిపారు. మొదట తీసుకున్న రుణం సక్రమంగా చెల్లించిన వారికి రెండవ దఫా రుణం కింద రూ. 20 వేల రుణం మంజూరు చేసినట్లు చెప్పారు.

మూడవ దశ కింద 251 మందికి రూ. 50 వేల రుణం అందించినట్లు మంత్రి తెలిపారు. అలాగే వడ్డీ సబ్సిడీ కింద రూ. 3 కోట్లు, క్యాష్ బ్యాక్ కింద రూ. 1.65 కోట్లు లబ్దిదారులకు అందజేసినట్లు తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ 4 నాటికి పీఎం స్వనిధి పథకం కింద రుణాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 4 లక్షల దరఖాస్తులు అందగా అందులో 67,404 దరఖాస్తులు అర్హత లేనివిగా గుర్తించి తిరస్కరించినట్లు తెలిపారు. 16,118 దరఖాస్తులు మంజూరు దశలో ఉన్నాయని, 29,853 మంది బ్యాంకులకు అందుబాటులో లేని కారణంగా రుణాల పంపిణీ పెండింగ్‌లో ఉన్నట్లు మంత్రి వివరించారు.

- Advertisement -

కోవిడ్ మహమ్మారి కారణంగా కుదేలైన వీధి వర్తకులు తిరిగి వారి వ్యాపార కార్యకలాపాలను కొనగించుకునేందుకు వర్కింగ్ కాపిటల్ కింద రూ. 10 వేల రుణం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం స్వానిధి పథకాన్ని 2020 జూన్ 1న ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. తీసుకున్న రుణం సకాలంలో చెల్లించిన వారికి రెండవ దఫా రుణం కింద రూ. 20 వేలు, మూడవ దఫా కింద రూ. 50 వేల రూపాయలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. సకాలంలో రుణం చెల్లించిన వారికి తీసుకున్న రుణంపై 7% వడ్డీ రాయితీ, డిజిటల్ చెల్లింపులు చేసిన వారికి క్యాష్ బ్యాక్ కింద ఏడాదికి రూ. 1,200 రూపాయలు చెల్లించినట్లు మంత్రి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement