దళిత ఆర్‌ఎంపీ వైద్యురాలితో అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు లైంగికంగా వేధించిన ఓ వ్యక్తిపై నిర్భయ కేసుతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైన ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన దళిత మహిళ ఆర్‌ఎంపీగా క్లినిక్ నడుపుతోంది. అదే గ్రామానికి చెందిన పాటి ప్రసాద్‌రెడ్డి వారం క్రితం ఆమె క్లినిక్‌కు వెళ్లి ఆరోగ్య సమస్యపై వైద్య సలహాలు తీసుకున్నాడు. అనంతరం ఆమె సెల్ నంబర్ తీసుకుని కాల్ చేయడం, మెస్సేజ్‌లు పెట్టడం ప్రారంభించాడు.
ఆమె నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈనెల 17న మధ్యాహ్నం క్లినిక్‌కు వెళ్లాడు. ‘నువ్వంటే నాకు ఇష్టం, నిన్ను ప్రేమిస్తున్నా.. ఒక్క ముద్దిస్తే రూ.25 వేలు ఇస్తా, 5 నెలలపాటు క్లినిక్ షెట్టర్ కిరాయి కడతా’నంటూ వేధించాడు. అంతటితో ఆగకుండా అసభ్యకరంగా మాట్లాడాడు. ఈ విషయాన్ని ఆమె అదే రోజు రాత్రి కుటుంబ సభ్యులకు చెప్పగా వారు అతడి ఇంటికి వెళ్లే సరికి పరారయ్యాడు. వెంటనే ఆమె పోలీసులను ఆశ్రయించడంతో ప్రసాద్‌రెడ్డిపై నిర్భయ కేసుతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, పట్టుకోవడానికి రెండు బృందాలను ఏర్పాటు చేశామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.