న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: విశాఖపట్నం నగరం కోసం భోగాపురం వద్ద కొత్తగా నిర్మించతలపెట్టిన అంతర్జాతీయ విమానాశ్రయం కోసం 2016లోనే ‘సైట్ క్లియరెన్స్’తో పాటు సూత్రప్రాయ ఆమోదం కూడా తెలిపామని కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ తెలిపారు. సోమవారం రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. భోగాపురం విమానాశ్రయం నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య (పీపీసీ) విధానంలో చేపట్టనుందని వెల్లడించారు. ఒప్పందం ప్రకారం ప్రతియేటా 60 లక్షల ప్రయాణికుల సామర్థ్యంతో విమానాశ్రయం మొదటి విడత పనులు పూర్తిచేయాలని తెలిపారు. మరో ప్రశ్నకు సమాధానంగా భోగాపురం విమానాశ్రయం కోసం సుమారుగా 2,203 ఎకరాల భూమి అవసరమని కేంద్ర మంత్రి తెలిపారు. ఎయిర్‌పోర్ట్ నిర్మాణపు ఖర్చు, నిధుల సేకరణ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశమని వెల్లడించారు.
మరోవైపు భోగాపురం విమానాశ్రయంలో కార్యాకలాపాలు మొదలైన వెంటనే ఇప్పటి వరకు విమాన రాకపోకలు సాగిస్తున్న విశాఖపట్నం నావల్ ఎయిర్‌ఫీల్డ్ ద్వారా జరుగుతున్న ప్రయాణికుల, వాణిజ్య విమానాల రాకపోకలను 30 ఏళ్ల పాటు నిలిపివేయనున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. అక్కడున్న భవనాలు, ఇతర మౌలిక వసతులు, విమానాశ్రయం కోసం ఉన్న సివిల్ ఎన్‌క్లేవ్ స్థలం 372.72 ఎకరాలను పూర్తిగా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు.