Tuesday, November 26, 2024

అనుమతులు తప్పనిసరి..  

  • అనుమతి లేకుంటే షాప్‌ నిర్వాహకులపై కఠిన చర్యలు
  • జిల్లా వ్యాప్తంగా 52 బాణసంచా షాపుల ఏర్పాటుకు దరఖాస్తులు
  • అగ్నిమాపక నిబంధనలు పాటించాలని అధికారుల సూచనలు
  • పోలీస్‌ నిబంధనలు కఠినతరం
  • విక్రయ దారులు జాగ్రత్తలు పాటించాలి
  • నిర్లక్ష్యం చేస్తే భారీ ఆస్తి నష్టం వాటిళ్లే ప్రమాదం
  • నాణ్యమైన టపాసులు విక్రయించాలి

పాపన్నపేట : దీపావళి పండుగ వచ్చేసింది.. ఇప్పటి నుంచే చిన్నారుల్లో ఉత్సాహం మొదలైంది.. టపాసులు కొనాలే.. పేల్చాలే అని ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. బాణాసంచ దుకాణాలు ఏర్పాటు చేయడమే తరువాయి అన్నట్టుగా ఉంది. అయితే టపాసుల దుకాణాల ఏర్పాటుకు వ్యాపారులు దరఖాస్తు చేసుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 52 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. దుకాణాల ఏర్పాటుకు ఫైర్‌ స్టేషన్‌ సర్వీస్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈసారి నిబంధనలు పోలీసులు కఠినతరం చేశారు. దుకాణ నిర్వాహకులు భద్రత విషయంలో రాజీపడితే కఠిన చర్యలుతప్పవని హెచ్చరిస్తున్నారు. వేలాది మంది దుకాణాల వద్దకు వచ్చే అవకాశం ఉన్నందున అదేస్థాయిలో వ్యాపారులు ఏర్పాట్లు చేసుకోవాలంటున్నారు. పోలీస్‌, రెవెన్యూ, ఎలక్ట్రీకల్‌, తూనికలు, కొలతలు, ఫైర్‌స్టేషన్లలో కూడా అనుమతులు తీసుకోవాలని సూచిస్తున్నారు. బాణసంచా కాల్చేటప్పుడు, దుకాణాల్లో ఫైర్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు చెబుతున్నారు. గతసంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా పండుగకు దూరంగా ఉన్న ప్రజలు.. ఈసారి దిపావళిని ఘనంగా నిర్వహింకోనుండడంతో టపాసుల విక్రయాలు సైతం పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనావేస్తున్నారు.

దీపావళి వచ్చిసింది. ఈ నెల 24న వేడుకలు జరుపుకోనున్నారు. టపాసుల దుకాణాల ఏర్పాటుకు వ్యాపారులు దరఖాస్తు చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నాటికి52 షాపులకు దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. మెదక్‌, రామాయంపేట, తూప్రాన్‌, చేగుంట, నర్సాపూర్‌ లల్లో షాపులకు అనుమతులు కోరుతూ దరఖాస్తు చేసుకున్నారని ఎస్‌ఎఫ్‌ఓ అమర్నాథ్‌ గౌడ్‌ తెలిపారు. దుకాణాల ఏర్పాటుకు ఫైర్‌ స్టేషన్‌ సర్వీస్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పోలీస్‌, రెవెన్యూ, ఎలక్ట్రీకల్‌, తూనికలు, కొలతలు, ఫైర్‌స్టేషన్లలో కూడా అనుమతులు తీసుకోవాలి. బాణసంచా కాల్చేటప్పుడు, దుకాణాల్లో ఫైర్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు చెబుతున్నారు.

ఈసారి భారీగా విక్రయాలు..
టపాసుల దుకాణాల విక్రయదారులకు ఈసారి పండుగే అని చెప్పొచ్చు.. ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా దీపావళి పండుగను కరోనా మహమ్మారి కారణంగా జరుపుకునేందుకు దూరంగా ఉన్న ప్రజలు ఈసారి కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజలు దీపావళి పండుగను ఘనంగా జరుపుకునేందుకు ఇష్టపడుతున్నారు. అదేస్థాయిలో ఈసారి బాణాసంచ విక్రయాలు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దుకాణదారులు కూడా స్టాక్‌ తెప్పించే విషయంలో ఏమాత్రం రాజీపడే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే గతసారి విక్రయాలు అంతంతగానే జరిగి వ్యాపారం నష్టపోయిన వారు ఈసారైనా లాభాలు వస్తాయనే ఆశతో కొంతఎక్కవగానే తెచ్చుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దుకాణాల వద్ద అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పోలీస్‌ శాఖ సూచిస్తున్నందుకు దుకాణ నిర్వాహకులు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా షాపుల వద్ద ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

వ్యాపారులు పాటించాల్సినవి..
రెండు దుకాణాల మధ్య కనీసం 3 అడుగుల దూరం ఉండాలి. దుకాణాల్లో సిగరెట్‌, బీడీ తాగొద్దు, విక్రయించొద్దు, ప్రతి దుకాణం వద్ద బకెట్లలో ఇసుక, 200 లీటర్ల నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలి. దుకాణంపై జింక్‌ లేదా సిమెంట్‌ రేకులను మాత్రమే వాడాలి. టపాసులు గోడకు మీటరు దూరం నుంచి నిల్వ చేయాలి. ఫైర్‌ సేఫ్టీ, విద్యుత్‌ పరికరాలు వాడాలి. షాపులో దీపాలు వెలిగించొద్దు. కిరోసిన్‌, డీజీల్‌ వినియోగించొద్దు.

- Advertisement -

కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
నాణ్యమైన బాణసంచా మాత్రమే కాల్చాలి. మందుగుండు సామగ్రి ఇంట్లో నిల్వ ఉంచకూడదు. టపాసులు కాల్చేటప్పుడు వదులుగా ఉన్న కాటన్‌, నూలు, దుస్తులు ధరించాలి. కాళ్లకు పాదరక్షలు వేసుకోవాలి. బకెట్‌ నీళ్లు, ఇసుక పక్కన ఉంచుకోవాలి. కళ్లల్లో మందుగుండు రేణువులు పడకుండా కళ్లద్దాలు ధరించాలి. రాకెట్లు, చిచ్చుబుడ్లు వంటి వాటిని విశాలమైన ప్రాంతంలో మాత్రమే కాల్చాలి. ఇళ్లు, వాహనాలు, జనావాసాల వద్ద, విద్యుత్‌ తీగలు, పెట్రోల్‌ బంకుల సమీపంలో కాల్చరాదు.

అనుమతి లేకపోతే చర్యలు – అమర్నాథ్‌గౌడ్‌, ఎస్‌ఎఫ్‌ఓ మెదక్‌
టపాసుల దుకాణాలకు అగ్నిమాపక శాఖ అనుమతులు తప్పనిసరి. అగ్నిప్రమాదాలు సంభవించకుండా ప్రతిషాపు ముందు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. అనుమతులు లేకుండా షాపులను ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవు. అతిధ్వనులు వచ్చే బాణసంచాకాల్చవద్దు. సాధారణంగా 60 నుంచి 80 డెసిబుల్స్‌ ధ్వనితో ఇబ్బంది ఉండదు. 120 డిసిబుల్స్‌ దాటితే నొప్పి వస్తుంది. అతి ధ్వనులతో కర్ణబేరి పగిలి కొన్నిసార్లు వినికిడి శక్తి కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అధిక పొగ వెలువడే వాటితో ముక్కుకు ప్రమాదం తప్పదు. రసాయన పొగ వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది.

జాగ్రత్తలు తీసుకోవాలి – సైదులు, డిఎస్‌పి మెదక్‌
టపాసుల అమ్మకాల సందర్భంగా షాపుల నిర్వాహకులు గొడవలు, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దుకాణాల వద్దకు మద్యం తాగి రావొద్దు. ప్రతి షాపు వద్ద రక్షణ చర్యలు చేపట్టాలి. బాణసంచా కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించి ప్రాణాలకు ముప్పు లేకుండా చూసుకోవాలి. పోలీస్‌ సిబ్బంది పర్యవేక్షిస్తారని ఆయన పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement