ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశంలో మామిడి సాగు చేసే రైతులకు ఇది శుభవార్త. అగ్రరాజ్యం అమెరికాకు భారత మామిడ పళ్లను ఎగుమతికి మార్గం సుగమం చేస్తూ అవసరమైన అనుమతులను కేంద్ర ప్రభుత్వం పొందింది. ఈ మేరకు ‘యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్’ (యుఎస్‌డిఎ) అనుమతులను మంజూరు చేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో గత రెండేళ్లుగా నిలిచిపోయిన ఎగుమతులు మళ్లి ప్రారంభం కానున్నాయి. 2017-20 మధ్యకాలంలో 3,000 మెట్రిక్ టన్నుల మామిడి పళ్లను ఎగుమతి చేయగా, అమెరికాలో భారత మామిడికి విశేషమైన ఆదరణ, డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది ఎగుమతులు 2019-20 గణాంకాలను మించి జరుగుతాయని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. 2020 నుంచి అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై కొనసాగుతున్న ఆంక్షల నేపథ్యంలో అమెరికాకు చెందిన యూఎస్ డిఏ ఇన్‌స్పెక్టర్లు దేశంలోని రేడియేషన్ సదుపాయాలను సందర్శించడానికి వీల్లేకపోయింది. దీంతో ఆ దేశంలో భారత్ నుంచి మామిడి పళ్ల దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేసింది.
2021 నవంబర్ 23న జరిగిన ట్రేడ్ పాలసీ ఫోరమ్ సమావేశంలో అమెరికాకు చెందిన యుఎస్‌డిఏతో భారత్‌కు చెందిన వ్యవసాయ, రైతు సంక్షేమ విభాగం ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం, భారత్ నుంచి మామిడి, దానిమ్మ పళ్లను అమెరికాకు ఎగుమతి చేయాల్సి ఉంటుంది. అలాగే అక్కణ్ణుంచి చెర్రీ పళ్లు, అల్ఫాల్ఫా ఎండుగడ్డిని దిగుమతి చేసుకుంటుంది. ఈ క్రమంలో రెండు దేశాలు రేడియేషన్ ప్రొటోకాల్‌ను అనుసరించాల్సి ఉంటుంది. పండ్లు, కూరగాయలను ఎక్కువకాలం నిల్వ ఉంచేందుకు వీలుగా వాటిని రేడియేషన్‌కు గురిచేసి, ఎయిర్‌టైట్ ప్యాకింగ్ చేస్తారు.
ఇది కూడా చదవండా : సెలవుల్లోనూ కాలేజీలు! సంక్రాంతి హాలిడేస్ ఇవ్వని పలు విద్యాసంస్థలు..
పరస్పర ఒప్పందంలో భాగంగా, ఆల్ఫోన్సో రకం మామిడితో ప్రారంభమయ్యే మామిడి సీజన్‌లో భారతదేశం మార్చి నుంచి అమెరికాకు మామిడి ఎగుమతి ప్రారంభించనుంది. 2017-18లో 2.75 మిలియన్ డాలర్ల విలువైన 800 మెట్రిక్ టన్నుల మామిడిని భారత్ ఎగుమతి చేసింది. 2018-19లో, 3.63 మిలియన్ డాలర్ల విలువైన 951 మెట్రిక్ టన్నులు, 2019-20లో 4.35 మిలి యన్ డాలర్ల విలువైన 1,095 మెట్రిక్ టన్నుల మామిడి పండ్ల ఎగుమతి జరిగింది. ఎగుమతిదారుల నుంచి అందిన అంచనాల ప్రకారం, ఈ ఏడాది మామిడి ఎగు మతి, 2019-20 గణాంకా లను అధిగమించవచ్చునని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. యుఎస్‌డిఏ ఆమోదంతో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి సాంప్రదాయ మామిడి ఉత్పత్తి బెల్ట్ నుంచి ఎగుమతులకు మార్గం సుగమమైంది.
అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఏపీఈడీఏ) ఉత్తరప్రదేశ్, బీహార్ నుండి లాంగ్రా, చౌసా, దుషేరి, ఫాజ్లీ వంటి రకాలకు చెందిన మామిడి పళ్లతో పాటు తూర్పు భారతదేశం నుండి ఇతర రుచికరమైన మామిడి పండ్లను ఎగుమతి చేయడానికి కూడా అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపింది. దానిమ్మ పండ్ల ఎగుమతి 2022 ఏప్రిల్ నుంచి మొదలవుతుంది. అలాగే అమెరికా నుంచి అల్ఫాల్ఫా ఎండుగడ్డి, చెర్రీ పండ్ల దిగుమతులు కూడా అదే నెల నుంచి మొదలవుతా యని కేంద్రం వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital