న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ సమస్య పరిష్కారానికి స్థానిక కంటోన్మెంట్ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని జహీరాబాద్ టీఆర్‌ఎస్ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ రక్షణ శాఖను కోరారు. కంటోన్మెంట్ ప్రాంత సమస్యపై బుధవారం ఆయన లోక్‌సభ జీరో అవర్‌లో ప్రస్తావించారు. కంటోన్మెంట్ గుండా అంతరాష్ట్ర, రాష్ట్ర రహదారులు వెళ్తున్నాయని, ట్రాఫిక్ సమస్య నేపథ్యంలో ఈ రహదారులను విస్తరించాల్సిన అవసరం ఏర్పడిందని వివరించారు. కంటోన్మెంట్ ప్రాంతం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం విస్తరణ పనులు చేయలేకపోతోందని చెప్పారు.
ఉత్తర హైదరాబాద్ ప్రాంతంలో ట్రాఫిక్ అంతకంతకు పెరుగుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం ఫ్లైఓవర్లు, స్కై వేల నిర్మాణం చేయాలని ప్రతిపాదించిందన్నారు. కానీ కాలక్రమేణా రాత్రి వేళల్లో కంటోన్మెంట్ ప్రాంతాన్ని మూసివేయడం ద్వారా సాధారణ పౌరుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని బీబీ పాటిల్ వివరించారు. ఈ అంశంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రిని జోక్యం చేసుకోవాలని, శాశ్వత పరిష్కారం కోసం వీలైనంత త్వరగా సహకారం అందించాలని ఆయన కోరారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..