Saturday, November 23, 2024

నదీ జలాలు కడలిపాలు.. భవిష్యత్‌లో సాగు, తాగునీటి ఎద్దడి తప్పదు : కేంద్ర జలసంఘం

అమరావతి, ఆంధ్రప్రభ : నదీ జలాలను సద్వినియోగం చేసుకునేందుకు రాష్ట్రాలు నీటి నిల్వ వనరులను పెంచుకోకపోతే భవిష్యత్‌ లో తీవ్రమైన తాగు, సాగునీటి ఎద్దడి ఎదుర్కొనే ప్రమాదముందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) హెచ్చరించింది. దేశంలో నదీ జలాల వినియోగంపై జలవనరుల నిపుణులతో ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ సమర్పించిన నివేదికను సీడబ్ల్యూసీ విడుదల చేసింది. మూడొంతుల నదీ జలాల్లో రాష్ట్రాలు కేవలం ఒక వంతు నీటిని మాత్రమే వినియోగించుకుంటుండగా.. రెండొంతుల జలాలు వృధాగా సముద్రం పాలవుతున్నాయని వెల్లడించింది. దేశంలోని అన్ని నదుల్లో ఏటా 70,591.75 టీఎంసీల జలాలు అందుబాటులోకి వస్తుండగా కేవలం 24,367.43 టీఎంసీల నీటిని మాత్రమే రాష్ట్రాలు వినియోగించుకుంటున్నాయి.. 46,224.32 టీఎంసీలు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయి.

కడలి పాలవుతున్న జలాలను దారిమళ్ళించి నిల్వ సామర్ద్యాలను పెంచుకునేలా జలాశయాల విస్తరణ, కొత్త జలాశయాలను నిర్మించుకోకపోతే భవిష్యత్‌ లో సాగు, తాగునీటికి తీవ్రమైన ఎద్దడి ఏర్పడి వివిధ రాష్ట్రాల్లోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదముందని తెలిపింది. నీటి నిల్వ వనరులను పెంచుకోకపోవటం వల్ల జనాబా పెరిగే కొద్దీ తలసరి నీటి లభ్యత తగ్గపోతుంది..ఇది ప్రమాదకర సంకేతమని నివేదికలో సీడబ్ల్యూసీ వెల్లడించింది. ప్రధాన నదులైన గోదావరి, కృష్ణా, గంగ, బ్రహ్మపుత్ర తదితర నదుల ద్వారా ప్రవాహరూపంలో లభిస్తున్న 70, 591 టీఎంసీల జలాల్లో భారీ వృధా నమోదు కావటమే కాకుండా ఎక్కడికక్కడ వర్షపాత రూపంలో లభిస్తున్న 1.37 లక్షల టీఎంసీల వినియోగంలోనూ రాష్ట్రాలు పటిష్టమైన నీటి వనరులను ఏర్పాటు చేసుకోవటంలో విఫలమవుతున్నాయని సీడబ్ల్యూసీ తెలిపింది.

తాగునీటికి కట కట..

దేశంలో తాగునీటి తలసరి లభ్యత భారీగా పడిపోవటంపై సీడబ్ల్యూసీ ఆందోళన వ్య్తక్తం చేస్తోంది. జనాభా పెరుగుతున్న కొద్దీ తలసరి నీటి లభ్యత పెరగాల్సి ఉండగా ప్రమాదకర స్థాయిలో తగ్గపోవటంపై రాష్ట్రాలు దృష్టి సారించాలని కోరింది. 2011లో 1816 క్యూబిక్‌ మీటర్లుగా ఉన్న తలసరి నీటి లభ్యత 2011 నాటికి 1545 క్యూబిక్‌ మీటర్లకు తగ్గింది. 2021 నాటికి అది మరింత తగ్గుముఖం పట్టి 1486 క్యూబిక్‌ మీటర్లకు చేరింది. ఈ నేపథ్యంలో సముద్రం పాలవుతున్న నీటిని ఒడిసిపట్టేలా నీటి నిల్వ వనరులను పెంచుకోకపోతే 2031 నాటికి 1367 క్యూబిక్‌ మీటర్లకూ, 2041 నాటికి 1282 కూ, 2051 నాటికి 1228 క్యూబిక్‌ మీటర్లకు తగ్గిపోతుంది.. దీంతో ప్రతి రాష్ట్రంలోని సగానికి ప్రాంతాల ప్రజలు తాగునీటితో పాటు రోజువారీ అవసరాల కోసం తీవ్రమైన ఇక్కట్లకు గురికావాల్సి వస్తుంది.. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు తక్షణం మేల్కొని నదీ ప్రవాహ జలాలతో పాటు వర్షపాత ఆధారిత నీటి వనరులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీడబ్ల్యూసీ కోరింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల్రకు తాజా అధ్యయన నివేదికలను పంపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement