Tuesday, November 19, 2024

స్పెయిన్ లో పెప్పెర్ ఇల్లే ….బ్రిట‌న్ లో ట‌మోటాల కొర‌త‌

బ్రిటన్‌ పౌరులకు పచ్చిమిర్చి, కాప్సికమ్‌ తరహా కూరగాయ పెప్పర్‌ కావాలంటే స్పెయిన్‌నుంచే ఎక్కువగా రావాలి. కానీ ప్రస్తుతం స్పెయిన్‌ వాసులకే అవి లభించడం లేదు. కూరగాయల దుకాణాల్లో అరలన్నీ ఖాళీగా ఉంటున్నాయి. చివరకు ఒక కుటుంబానికి కేవలం రెండు ప్యాకెట్ల చొప్పున పెప్పర్‌ ఇవ్వాలని ఓ నిబంధనను అమలు చేయాల్సి వస్తోంది. చాలా దుకాణాల్లో నో స్టాక్‌ బోర్డులు పెట్టేశారు. టమోటాలు, కీరదోసల పరిస్థితీ అంతే. ఇక్కడే కాదు మొరాకో వంటి దేశాల్లోనూ ఇదే పరిస్థితి. ఎన్నడూ లేని రీతిలో స్పెయిన్‌లో ఇప్పుడు శీతల వాతావరణం నెలకొంది. ఆ పరిస్థితుల్లో పెప్పర్‌ పంట దిగుబడి రావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాస్త వెచ్చని, వెలుగు ఎక్కువగా ఉండే వాతావరణంలో పెప్పర్లు ఆకుపచ్చ రంగు నుంచి పసుపు, ఆ తరువాత ఎరుపు రంగుకు మారతాయి. ప్రస్తుతం శీతలగాలులు ఎన్నడూ లేనివిధంగా ఉండటంతో దిగుబడి ఆలస్యంగాను, తక్కువగాను ఉంటోంది. యూకేలో ప్రతి దుకాణదారుడు పెప్పర్లను స్పెయిన్‌నుంచే తెచ్చుకోవాలి. కానీ ఇతర దేశాలకు సరఫరా సంగతేమోగానీ దేశావసరాలకే సరిపోవడం లేదు. దక్షిణ ఐరోపా, ఉత్తర ఆఫ్రికాలో తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో కూరగాయల సాగుపై ప్రభావం పడుతోంది. బ్రిటన్‌కు అవసరమైన టమోటాల్లో నాలుగింట ఒకవంతు ఒక్క మొరాకోనుంచే రావాలి. కానీ అక్కడ టమోటా సాగుకు అనువైన పరిస్థితులు లేవు.

Advertisement

తాజా వార్తలు

Advertisement