Saturday, November 23, 2024

TG | తెలంగాణలో ప్రజా తిరుగుబాటు ఖాయం.. బండి సంజ‌య్

  • కాంగ్రెస్ సర్కార్ పై బీజేపీ యుద్దం
  • మహారాష్ట్రలో పట్టిన గతే తెలంగాణలో
  • కాంగ్రెస్ ఐరన్ లెగ్ పార్టీ
  • మహారాష్ట్రలో కాంగ్రెస్ అబద్దాలను జనం ఛీకొట్టారు
  • మోదీ అభివృద్ధి మంత్రం పనిచేసింది
  • కులగణన పెద్ద బోగస్
  • పెన్సిల్ ఫారాలు నింపి.. పెన్నుతో సంతకం తీసుకోవడమేంది
  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్


కరీంనగర్, ఆంధ్రప్రభ : తెలంగాణలో ప్రజా తిరుగుబాటు రాబోతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ యుద్దం ప్రకటించబోతోందన్నారు. మహారాష్ట్రలో ఎన్ని అబద్దాలు ప్రచారం చేసినా కాంగ్రెస్ కూటమిని ప్రజలు నమ్మలేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివృద్ధి మంత్రమే పనిచేసిందని, గతంలో కంటే ఎక్కువ మెజారిటీ సీట్లు బీజేపీ కూటమికి కట్టబెట్టడమే ఇందుకు నిదర్శనమ‌న్నారు. కాంగ్రెస్ ఐరన్ లెగ్ పార్టీ అని, ఆ పార్టీతో జతకట్టిన పార్టీలన్నీ మునిగిపోతున్నాయన్నారు.

ఇండియా కూటమి ముక్కలు కావడం ఖాయమన్నారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మొదలు కాబోతున్నాయని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే అవసరం బీజేపీకి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యేలే కూల్చుకుంటారన్నారు. తెలంగాణ నుండి కాంగ్రెస్ పార్టీ డబ్బు సంచులు తీసుకెళ్లి మహారాష్ట్ర ఎన్నికల్లో ఖర్చు చేశారన్నారు. అబద్దాలు, డబ్బుతో గెలవాలని చూశారని, కానీ అవేమీ పని చేయలేదన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇచ్చిన హమీలను అమలు చేయకుండా తెలంగాణ, కర్నాటక ప్రభుత్వాల వైఫల్యాలే మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓటమికి ప్రధాన కారణమన్నారు.

- Advertisement -

ఆయా రాష్ట్రాల్లో ఒక్క హామీని అమలు చేయకుండానే అన్నీ చేసినట్లుగా కోట్లాది రూపాయల యాడ్స్ ఇచ్చి అబద్దపు ప్రచారం చేయాలని చూసినా జనం నమ్మలేదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మహారాష్ట్రలో తిష్టవేసి పోలింగ్ బూత్ ల వారీగా ప్రచారం చేసినా పట్టించుకోలేదన్నారు. వాస్తవాలు గ్రహించి కాంగ్రెస్ కూటమిని చావు దెబ్బ కొట్టారని, మహారాష్ట్ర ప్రజలకు హ్యాట్సాఫ్ అన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. మహిళలకు తులం బంగారం, స్కూటీ, నెలనెలా రూ.2500 లు ఎప్పుడు ఇస్తారో సమాధానం చెప్పాలన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడానికి పైసల్లేవని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సొమ్మును తీసుకుపోయి మహారాష్ట్రలో ఎలా ఖర్చు చేసిందని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం గ్రామాల్లో తిరగలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఒక్క పని కావడం లేదని, ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తితో ఉన్నారని, అందుకే ఆ పార్టీలో లుకలుకలు రాబోతున్నాయన్నారు.

కులగణన పెద్ద బోగస్…
కులగణన ఫారంలపై పెన్సిల్ తో రాస్తున్నారని, పెన్నుతో సంతకం తీసుకుంటున్నారన్నారు. ఎందుకంటే పెన్సిల్ తో రాస్తే తరువాత కాంగ్రెస్ పార్టీ తనకు అనుగుణంగా మార్పు చేసుకోవాలనుకుంటోందన్నారు. అందుకే ప్రజలు సహకరించడం లేదని, చాలా చోట్ల నిలదీస్తున్నారు. ఈవీఎంలపై ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు. ఈవీఎంలు మా చేతుల్లో ఉంటే జార్ఘండ్ లో బీజేపీ గెలిచేది కదా అని, గతంలో తెలంగాణ, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచిందన్నారు. ఇలాంటి ఆరోపణలను జనం నమ్మరని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement