న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ మంత్రి కే.టీ. రామారావు (కేటీఆర్) బస్సు యాత్రకు బదులు మోకాలి యాత్ర చేసినా ప్రజలు నమ్మరని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షులు, ఎంపీ డా. కే. లక్ష్మణ్ అన్నారు. గురువారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు ఓటేస్తే అది బీఆర్ఎస్‌కే చెందుతుందని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో కాంగ్రెస్‌ను నమ్మి ఓటేస్తే.. గెలిచిన వెంటనే వెళ్లి బీఆర్ఎస్‌లో కలిసిపోయారని గుర్తుచేశారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద అన్ని రాష్ట్రాలకు గృహాలను మంజూరు చేస్తే, తెలంగాణలో ఇంత వరకు ఒక్క లబ్దిదారుడికి కూడా ఇల్లు అందలేదని డా. లక్ష్మణ్ అన్నారు. సొంతింటి కల నెరవేర్చలేకపోయిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించడం ఖాయమని ఆయనన్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీ మాత్రమే ఏకైక ప్రత్యామ్నాయమని, ప్రజలు కచ్చితంగా తమను ఆదరిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు గురువారం జరిగిన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో తెలంగాణ ప్రస్తావన రాలేదని తెలిపారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అభ్యర్థుల గురించి మాత్రమే చర్చ జరిగిందని వెల్లడించారు. వచ్చే నెల మొదటివారంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కసరత్తు ఉంటుందని తెలిపారు. తెలంగాణలో గెలుపు గుర్రాలను గుర్తించి అభ్యర్థులుగా నిలబెడతామని వ్యాఖ్యానించారు.
ఓబీసీల కోసమే పీఎం-విశ్వకర్మ
సమాజంలో 50% కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న వెనుకబడిన వర్గాలు (ఓబీసీ) కోసమే కేంద్ర ప్రభుత్వం ‘పీఎం విశ్వకర్మ’ పథకాన్ని తీసుకొచ్చిందని డా. లక్ష్మణ్ తెలిపారు. రూ. 13 వేల కోట్లతో 18 చేతివృత్తులను గుర్తించి సహకరించేందుకు ఈ పథకం రూపకల్పన జరిగిందని వెల్లడించారు. ఈ పథకం కింద చేతివృత్తి నిపుణులకు సర్టిఫికేట్‌తో పాటు గుర్తింపు కార్డ్ అందజేస్తామని, అలాగే ఆధునిక పరికరాల కోసం ఆర్థిక సహాయంతో పాటు ఎలాంటి పూచీకత్తు లేకుండా మొదటి విడతలో రూ. 1 లక్ష వరకు రుణ సహాయం అందించనున్నట్టు వెల్లడించారు. రెండవ విడతలో ఈ రుణం రూ. 2 లక్షల వరకు పెంచనున్నట్టు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదిన కానుకగా సెప్టెంబర్ 17న ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు.
చేతివృత్తి, హస్తకళల నిపుణులను ప్రోత్సహించేందుకు ప్రధాన మంత్రి మోదీ తీసుకొచ్చిన ఈ విప్లవాత్మక పథకం విషయంలో ఓబీసీ సమాజం తరఫున బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడిగా డా. లక్ష్మణ్ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఓబీసీల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని, కేంద్ర మంత్రివర్గంలో 27 మంది మంత్రులకు చోటు కల్పించడంతో పాటు ఉన్నత విద్యలో 27% రిజర్వేషన్లు కల్పిస్తూ ఓబీసీలకు ప్రయోజనం కల్పిస్తున్నట్టు గుర్తుచేశారు. కొన్ని దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఓబీసీలను ఎప్పుడూ ఓటుబ్యాంకుగా వాడుకున్నారు తప్ప ఓబీసీలకు చేసిందేమీ లేదని అన్నారు. చివరకు ఓబీసీ రిజర్వేషన్లకు కూడా ఆ పార్టీ అనుకూలంగా వ్యవహరించలేదని మండిపడ్డారు.
బుధవారం నాటి కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాలకు విస్తృత ప్రయోజనాలు కలిగించేలా రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిందని డా. లక్ష్మణ్ అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు బీజేపీకి అనుకూలంగా ఓటు వేయకపోయినా సరే, కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేసే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం సహకరించకపోయినా సరే కేంద్ర ప్రభుత్వం తమ దృష్టిలో అన్ని రాష్ట్రాలు సమానం అన్నట్టుగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తోందని అన్నారు. 9 రాష్ట్రాల్లో 35 జిల్లాలకు ప్రయోజనం చేకూర్చుతూ రూ. 35 వేల కోట్ల విలువైన 7 రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలపగా, అందులో 3 ప్రాజెక్టులు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయని, తెలంగాణలోనే 400 కి.మీ కంటే పొడవైన రైలు మార్గాన్ని డబ్లింగ్ చేస్తున్నామని తెలిపారు.
తెలంగాణపై ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని అన్నారు. పదే పదే గుజరాత్ పేరెత్తి కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని విమర్శించే కేసీఆర్, కేటీఆర్ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బీబీనగర్ – గుంటూరు మార్గాన్ని డబ్లింగ్ చేయడం వల్ల నల్గొండ జిల్లాలో ఉన్న సిమెంట్ పరిశ్రమలు సహా రైతు ఉత్పత్తుల రవాణాకు ప్రయోజనం కలగడంతో పాటు హైదరాబాద్ – చెన్నై నగరాల మధ్య దూరం తగ్గి ప్రయాణ వేగం పెరుగుతుందని తెలిపారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడితే అభివృద్ధి మరింత వేగంతో పరుగులు తీస్తుందని ప్రజలు గుర్తించాలని డా. లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.