Tuesday, November 26, 2024

పలుచోట్ల పరిషత్ ఎన్నికలను బహిష్కరించిన ప్రజలు

ఏపీలో పరిషత్ ఎన్నికలు మందకొడిగా జరుగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ప్రజలు ఓట్లు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం తెల్ల గుంట గ్రామంలో ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. తాగునీటి సమస్యను పరిష్కరించలేదని ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పెడచెవిన పెట్టారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో మూడు రోజులుగా ఖాళీ బిందెలతో గ్రామ ప్రజలు నిరసన తెలియజేస్తున్నారు.

మరోవైపు నెల్లూరు జిల్లా కావలి తుమ్మలపెంటలో ఓటుకు డబ్బులు ఇవ్వలేదని ఓ వ్యక్తి ఓటు వేయకుండా వెళ్లిపోయాడు. పోలింగ్ సెంటర్ వద్ద అభ్యర్థులను డబ్బులు అడగగా.. ఇవ్వకపోవడంతో ఓటు వేయలేదు. అటు తూ.గో జిల్లా గున్నేపల్లి అగ్రహారంలో పోలింగ్ ఆగిపోయింది. 51/31 పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ పేపర్ తారుమారు కావడంతో పోలింగ్ నిలిచిపోయింది.

చిత్తూరు జిల్లాలోని గుడిపాల మండలం వెపాలమానుచేను గ్రామస్థులు పరిషత్‌ ఎన్నికలను బహిష్కరించారు. తమ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని చెబుతూ గ్రామస్థులు ఓటేసేందుకు నిరాకరిస్తున్నారు. ప్రభుత్వం తమ గ్రామంపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే పోలింగ్‌ను బహిష్కరించినట్లు గ్రామస్థులు తెలిపారు.

టీడీపీ బరిలో లేదని పోలింగ్ బహిష్కరణ
చిత్తూరు జిల్లా నిండ్ర మండలం కీళంబాకం గ్రామస్థులు కూడా పరిషత్‌ పోలింగ్‌ను బహిష్కరించారు. తెదేపా అభ్యర్థులు పోటీలో లేకపోవడంతో ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు గ్రామస్థులు ప్రకటించారు. ఓటు వేయాలని గ్రామస్థులతో మాట్లాడేందుకు ఎన్నికల అధికారులు ప్రయత్నిస్తున్నారు.


మరోవైపు రామకుప్పం మండలం రామాపురం తండావాసులు పరిషత్‌ ఎన్నికలను బహిష్కరించారు. తమ గ్రామాన్ని పంచాయతీ కేంద్రంగా చేయకపోవడంపై గ్రామస్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా పోలింగ్‌ను బహిష్కరించినట్లు గ్రామస్థులు తెలిపారు.

- Advertisement -

బ్యాలెట్ బాక్స్‌ నీళ్లలో వేసిన బీజేపీ ఏజెంట్‌‌

నెల్లూరు జిల్లా ఎఎస్‌పేట మండలం పాముగోడులో పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలో వృద్ధుడి ఓటు విషయంలో పోలింగ్ కేంద్రం వద్ద గొడవ జరిగింది. ఓటు వేసేందుకు వచ్చిన వైసీపీ కార్యకర్తను అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. బీజేపీ ఏజెంట్‌ బ్యాలెట్ బాక్స్‌ను నీళ్లలో ముంచేయడంతో ఎన్నికలు అధికారులు పోలింగ్‌ నిలిపివేశారు. అడ్డుకునేందుకు యత్నించిన అధికారులను తోసేసి బీజేపీ ఏజెంట్‌ ప్రసాద్‌ బ్యాలెట్‌ బాక్స్ ఎత్తుకెళ్లి నీళ్లల్లో వేశాడు.

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్‌ మండలం సాకుర్రు గున్నేపల్లి పోలింగ్ వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. బ్యాలెట్ పత్రాలపై జనసేన పార్టీ గుర్తు లేకపోవడంతో అభ్యర్థి ఆందోళన చేశారు. దీంతో పోలింగ్ ప్రక్రియను అధికారులు నిలిపివేశారు.


విశాఖపట్నం: అరకు వ్యాలీలో ఎమ్మెలే చెట్టి ఫాల్గుణ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

కర్నూలు జిల్లా పాములపాడు మండలం మద్దూరు గ్రామంలో ఎమ్మెల్యే ఆర్థర్ ఓటు వేశారు.

చిత్తూరు మండలం పాలూరులో ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్నభీముని చెరువులో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ప్రకాశం జిల్లా పీసీ పల్లి మండలం లింగన్న పాలెంలో దొంగ ఓటు వేయడానికి వచ్చిన వైసీపీ కార్యకర్తలను టీడీపీ ఏజెంట్లు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాగా పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement