చిత్తూరు, (ప్రభ న్యూస్): రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నగరంలో అందుకు తగినవిధంగా సన్నద్ధంగా ఉండాలన్నారు. ఈ మేరకు గురువారం కమిషనర్ తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో వర్షాన్ని ఎదుర్కోవడానికి తీసుకునే చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నీవా నది పరివాహక ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిల్లలను వాగులోకి పంపరాదన్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షం కురిస్తే నదిలో నీటిమట్టం అమాంతం పెరిగే అవకాశాలు ఉన్నందున నీవా పరివాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతానికి చేరుకోవాలన్నారు.
వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నందున వాహనాల్లో దాటే ప్రయత్నం చేయరాదన్నారు. గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నందున శిథిల భవనాల్లో ఉండరాదని, తగిన సురక్షిత ప్రాంతాల్లో ఉండాలన్నారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో శిధిల భవనాలకు ఇదివరకే నోటీసులు అందించామన్నారు. సహాయక చర్యలకు వచ్చే అధికారులు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంకు స్థానికుల సహకారం అందించాలన్నారు. అత్యవసర సమయాల్లో నగరపాలక సంస్థ కాల్ సెంటర్ నెంబర్ 08572 232745 సమాచారం ఇవ్వాలన్నారు.
వర్షాల నేపథ్యంలో కాలువల్లో వర్షపు నీరు నిలువకుండా తక్షణం చర్యలు చేపట్టాలని ప్రజారోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై సూపర్వైజర్ అధికారులకు, వార్డ్ కార్యదర్శులకు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మార్గనిర్దేశం చేశారు. సమావేశంలో సహాయ కమిషనర్ శ్రీలక్ష్మి, ఎంహెచ్వో అనిల్ కుమార్, ఎంఈ నారాయణస్వామి, ఇన్చార్జ్ మేనేజర్ ఉమా మహేశ్వర్ రెడ్డి, విభాగాల అధిపతులు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily