వాజేడు (ప్రభ న్యూస్): మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత ములుగు జిల్లా ఏటూరునాగారం, వాజేడు మండలాల్లో ఇవ్వాల (సోమవారం) పర్యటించారు. గోదావరి నది పరివాహక వరద ముంపు గ్రామాలను వారు పరిశీలించారు. ఓవైపు జోరుగా వర్షం కురుస్తుండడంతో గొడుగులు పట్టుకొని పూసూరు వంతెన వద్దకు వచ్చి గోదారి ఉధృతిని పరిశీలించారు. గోదావరి వరదల సమయంలో అధికారులు అందుబాటులో ఉండి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, కన్నాయిగూడెం, ఏటూరునాగారం, మంగపేట మండలాల ప్రజలకు గోదావరి వరద ప్రభావం ఎక్కువగా ఉంటుంది కనుక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గోదావరి ప్రభావిత వరద ముంపు బాధితులకు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి, ఎంపీ అధికారులకు సూచించారు. వరదల సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మండలాల వారీగా అధికారులతో ఎప్పటికప్పుడు వరదలపై సమీక్షిస్తూ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ములుగు కలెక్టర్ ను కోరారు. పూసూరుగోదావరిని సందర్శించిన ఆమె గోదావరిలో కాయిన్స్ వేసి దండం పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ములుగు కలెక్టర్ కృష్ణాదిత్య, మండల స్పెషల్ ఆఫీసర్ సర్దార్ సింగ్, వాజేడు తాసిల్దార్ గూడూరు లక్ష్మణ్, ఎంపీడీవో విజయ తదితరలున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.